బలపడిన అల్పపీడన ద్రోణి... రుతుపవనాల్లో కదలిక

16 Aug, 2015 19:50 IST|Sakshi

విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో వానలకు పరిస్థితులు మళ్లీ అనుకూలిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి రాయలసీమ, తెలంగాణల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ఒక్కసారిగా బలం పుంజుకుంది. అదే సమయంలో బలహీనంగా ఉన్న నైరుతి రుతుపవనాల్లో కూడా చురుకుదనం సంతరించుకున్నట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. రానున్న రెండు, మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో బాపట్ల, విజయనగరంలో 7 సెం.మీలు, పూసపాటిరేగలో 6, చీమకుర్తి, ప్రత్తిపాడు, అద్దంకి, మర్రిపూడి, చిత్తూరుల్లో 5, మాచెర్ల, నర్సీపట్నం, తిరుమలలో 4, కుప్పం, కళింగపట్నం, పోలవరంలలో 3, జూపాడుబంగ్లా, పాలసముద్రం, పాకాల, సంతమగుళూరు, డెంకాడ, గూడూరు, తునిల్లో రెండేసి సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

మరిన్ని వార్తలు