కన్నీళ్లు పెట్టించే కుక్క కథ!

28 Aug, 2014 05:32 IST|Sakshi
కన్నీళ్లు పెట్టించే కుక్క కథ!

కొన్ని అనుబంధాలు అంతే. అల్లుకుంటే తెగిపోవు. ఎవరి మధ్య అయినా అనుబంధం చిక్కబడితే వారిని విడదీయడం చాలా కష్టం. వీరిలో ఎవరూ దూరమైనా అవతలివారు తట్టుకోలేరు. అది మనుషులైనా, మూగజీవాలైనా ఒకటే. ముఖ్యంగా మనుషులతో అనుబంధాలను పెనవేసుకున్న మూగజీవాలు తమ మనిషి దూరమైతే తట్టుకోలేవు. మౌనంగా రోదిస్తాయి. తమ చర్యల ద్వారా భావాలను వ్యక్తం చేస్తుంటాయి. ఇందుకు చెన్నైలో జరిగిన ఉదంతమే రుజువు.

భాస్కర్ అనే 18 ఏళ్ల కుర్రవాడు ఆగస్టు 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో అతడు మృతి చెందాడు. భాస్కర్ మృతదేహాన్ని అవడి బ్రిడ్జి సమీపంలోని శ్మశానంలో ఖననం చేశారు. కథ ఇక్కడితో అయిపోలేదు. భాస్కర్ ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క 'టామీ' అతడి మరణాన్ని తట్టుకోలేకపోయింది. శ్మశానం నుంచి అందరూ ఇంటికి వెళ్లిపోయినా అది మాత్రం అతడి సమాధి వద్దే ఉండిపోయింది.

పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఎండా, వాన లెక్కచేయలేదు. అంతేకాదు భాస్కర్ సమాధి వద్ద నుంచి ఇంచు కూడా కదలలేదు. కాళ్లతో సమాధిని తవ్వేందుకు ప్రయత్నించింది. ఆ నోటా ఈనోటా విషయం తెలుసుకున్న బ్లూక్రాస్ సంస్థ వాలంటీర్లు శునకాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టినా అయినా ఫలితం లేకపోయింది. దీంతో వారు భాస్కర్ తల్లి సుందరి సహాయం కోరారు. ఆమెను టామీ దగ్గరకు తీసుకెళ్లారు.

తన కొడుకు ఐదేళ్ల నుంచి అపురూపంగా టామీని పెంచుకున్నాడని నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తున్న సుందరి తెలిపింది. తన కొడుకు చనిపోయిన నాటి నుంచి టామీ కనిపించలేదని ఆమె వెల్లడించింది. టామీని తన ఒళ్లోకి తీసుకుని వలవల ఏడ్చింది. కొడుకు పోయినా టామీ కోసమే తాను బతికున్నానని ఆమె కన్నీళ్ల పర్యంతమైంది. టామీ ఇక్కడవుంటే ఏమైపోతుందన్న బెంగతో ఆమె దాన్ని తీసుకుని తన సొంతూరు తిరుమన్నామలైకు వెళ్లిపోయింది. పాపం టామీ ఇపుడెలా ఉందో?

మరిన్ని వార్తలు