దేశవ్యాప్తంగా గ్యాస్ పోర్టబిలిటీ

23 Jan, 2014 02:27 IST|Sakshi
దేశవ్యాప్తంగా గ్యాస్ పోర్టబిలిటీ

న్యూఢిల్లీ: సిలిండర్ల సరఫరాలో జాప్యం చేసే ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, గ్యాస్ కంపెనీలను వినియోగదారులు మార్చుకునే సౌలభ్యాన్ని కల్పించే ఎల్పీజీ కనెక్షన్ పోర్టబిలిటీని కేంద్రం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ బుధవారం ఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు కింద 2013 అక్టోబర్ నుంచే 13 రాష్ట్రాల్లోని 24 జిల్లాల్లో ఈ పథకం అమల్లోకి వచ్చినా అందులో వినియోగదారులు కేవలం గ్యాస్ ఏజెన్సీలను మార్చుకునే సౌలభ్యాన్ని మాత్రమే కల్పించారు. తాజాగా దేశవ్యాప్తంగా 480 జిల్లాల్లో అందుబాటులోకి తెచ్చిన ఈ పథకంలో గ్యాస్ ఏజెన్సీలతోపాటు ఎల్పీజీ కంపెనీలను కూడా వినియోగదారులు మార్చుకునే వెసులుబాటు ఉంది. వినియోగదారుడికి ఎల్పీజీ కనెక్షన్ పోర్టబులిటీ అధికారంతో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ లేదా గ్యాస్ కంపెనీ తప్పనిసరిగా పనితీరు మెరుగుపరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పెట్రోలియంశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కనెక్షన్ పోర్టబులిటీ కోసం వినియోగదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దేశంలో 8.2 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులున్నారు.
 

మరిన్ని వార్తలు