లక్నోలో యోగా దినోత్సవం

18 Apr, 2017 08:56 IST|Sakshi

న్యూఢిల్లీ: నవాబుల నగరం, ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఈ ఏడాది అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహించనున్నారు. జూన్‌ 21న లక్నోలో నిర్వహించనున్న మూడో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. లక్నోలో వేడుకలు జరపాలని అధికారులు నిర్ణయించినప్పటికీ నగరంలో వేదిక ఖరారు కాలేదు. ఈ విషయమై ప్రధాని కార్యాలయం తుది నిర్ణయం తీసుకుంటుందని వారు స్పష్టం చేశారు. 

2015 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా జూన్‌ 21తేదీని యోగ దినోత్సవంగా జరుపుకోవడం తెలిసిందే. మార్చిలో యూపీ ప్రభుత్వం యోగా మహోత్సవం పేరిట మూడు రోజులపాటు ఉత్సవం జరిపింది. భారత్‌లో జరిగే ఈ కార్యక్రమానికి భోపాల్, జైపూర్, అహ్మాదాబాద్, రాంచీకి అవకాశం ఈ సారి ఇవ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. గతేడాది చండీగఢ్‌కు అవకాశం రాగా, 2015లో మొదటిసారిగా న్యూఢిల్లీ వేదికగా నిలిచింది.

దేశంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని జరిపించాలని కేంద్రం యోచిస్తోంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అన్ని వర్సిటీల్లో తప్పకుండా యోగా దినోత్సవాన్ని జరపాలని వైస్‌ చాన్సలర్లను ఆదేశించింది. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో యోగా ప్రతిజ్ఞ పేజీని ఇప్పటికే 2.6లక్షల మంది సందర్శించారు. 2015లో 175దేశాలు, 2016లో 192దేశాలు యోగా దినోత్సవం జరుపుకున్నాయి.

మరిన్ని వార్తలు