లగ్జరీ కార్... టాప్‌గేర్!

25 Sep, 2013 02:18 IST|Sakshi

 న్యూఢిల్లీ: మందగమనంతో వాహనాల అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కోట్ల ఖరీదు చేసే సూపర్ లగ్జరీ కార్ల జోరు మాత్రం తగ్గలేదు. పెపైచ్చు లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు మరిన్ని కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టడానికి ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఆర్థిక సర్వీసుల సంస్థ సీఎల్‌ఎస్‌ఏ ఇటీవలి నివేదిక ప్రకారం భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య 2015 నాటికి రెట్టింపై 4,03,000కి పెరుగుతుందని అంచనా. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా కన్నా కూడా అత్యధిక సంఖ్యలో అత్యంత సంపన్నులు భారత్‌లోనే ఉండనున్నారు.
 
 ఇలాంటి గణాంకాలతో అత్యంత ఖరీదైన కార్ల కంపెనీలు భారత్‌పై మరింతగా దృష్టి పెడుతున్నాయి. అంతర్జాతీయ దిగ్గజాలు ఇప్పటిదాకా ఏటా రెండో, మూడో సూపర్ లగ్జరీ కార్ల కొత్త మోడల్స్ భారత్‌లో ఆవిష్కరించేవి. కానీ, ఈ ఏడాది మాత్రం ఏకంగా ఆరు మోడల్స్‌ని ఆవిష్కరిస్తున్నాయి. ఇటలీకి చెందిన  సూపర్ స్పోర్ట్స్‌కారు బ్రాండ్ లంబోర్గిని, బ్రిటిష్‌కి చెందిన బెంట్లీ.. ఆస్టన్ మార్టిన్, నెదర్లాండ్స్ కంపెనీ స్పైకర్ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్, గలార్డో ఎల్‌పీ550-2 లిమిటెడ్ ఎడిషన్‌లను, రోల్స్ రాయిస్ రెయిత్‌లను ప్రవేశపెట్టాయి. వీటి ధర రూ. 3.5 కోట్ల పైమాటే.
 
 రూ.37 కోట్ల దాకా రేట్లు..
 సాధారణంగా భారత్‌లో లగ్జరీ సెగ్మెంట్ కార్లు మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, పోర్షే, జాగ్వార్ అండ్ ల్యాండ్‌రోవర్ వంటి బ్రాండ్లతో మొదలవుతుంటాయి. ఈ కార్ల ధరలు (ప్రీమియం మోడల్స్ మినహా) సుమారు రూ. 1 కోటి లోపే ఉంటున్నాయి. అయితే, కొన్నాళ్లుగా వీటిని మించిన సూపర్ లగ్జరీ బ్రాండ్లకు గిరాకీ పెరుగుతోంది. 20 అడుగుల పొడవు మొదలు రెండు డోర్ల సూపర్ ఫాస్ట్ కార్ల దాకా వీటిలో ఉంటున్నాయి. బుగాటి, కీనిగ్‌సెగ్, ఫెరారీ, పగాణీ, మాసెరాటి వంటి బ్రాండ్లు ఈ సెగ్మెంట్‌లో ఉంటున్నాయి.
 
 మిగతా బ్రాండ్లు వేలల్లో అమ్మితే ఇవి రెండంకెల స్థాయిలో అమ్ముడవుతున్నా కంపెనీలకు ఆదాయం భారీగానే ఉంటోంది. దిగుమతి సుంకాలు పెరగడం, రూపాయి పతనం తదితర కారణాలతో సూపర్ లగ్జరీ కార్ల రేట్లు భారీగా పెరుగుతున్నప్పటికీ .. క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్స్, ఇతర రాజకీయ నాయకులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. వీరు కొనే కార్ల ధరలు సుమారు రూ. 1 కోటి నుంచి రూ. 7 కోట్ల దాకా ఉంటున్నాయి. అదే, ఆస్టన్ మార్టిన్ వన్77, బుగాటి వేరాన్ వంటి మోడల్స్ ధరలు ఏకంగా రూ. 20 కోట్లు నుంచి రూ. 37 కోట్ల దాకా ఉన్నాయి. దేశీయంగా ఇవి అత్యంత ఖరీదైనవి.
 
 అమ్మకాల్లో 25% దాకా వృద్ధి..: సూపర్ లగ్జరీ కార్లు దేశీయంగా ఏటా  20-25% వృద్ధితో 300-400 మేర అమ్ముడవుతున్నాయని అంచనా. సగటున ఒక్కో కారు ఖరీదు రూ. 3.5 కోట్లు లెక్కగడితే..ఈ మార్కెట్ విలువ రూ. 1,500 కోట్లు. లంబోర్గిని గతేడాది 17 కార్లు విక్రయించింది. ఇప్పుడున్న జోరును బట్టి చూస్తే తాము నిర్దేశించుకున్నట్లుగా 2015 నాటికన్నా ముందుగానే 50 సూపర్ కార్ల అమ్మకాల లక్ష్యాన్ని సాధించేయగలమనేది కంపెనీ వర్గాల ధీమా. ఇక ఆస్టన్ మార్టిన్ గతేడాది 20 కార్లను విక్రయించగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్యను దాటేసింది. ఇదే ఊపులో కొత్తగా తీర్చిదిద్దిన డీబీఎస్ మోడల్‌ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఆస్టన్ మార్టిన్ కార్ల రేట్లు సగటున రూ. 3 కోట్ల పైనే.
 
 వచ్చే నెల బెంట్లీ ఫ్లయింగ్ స్పర్..
 బెంట్లీ మోటార్స్ త్వరలో ఫ్లయింగ్ స్పర్ కారును వచ్చే నెల ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 17.3 అడుగుల పొడవుండే ఈ సెడాన్ కారు, గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. విలాసవంతమైన లెదర్ సీట్లు, మినీ రిఫ్రిజిరేటరు మొదలైన హంగులు ఇందులో ఉంటాయి. ఇక సూపర్ స్పోర్ట్స్ కార్లను తయారుచేసే స్పైకర్ కంపెనీ.. ఈ ఏడాది ఆఖరులో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ తమ కారు సీ8 ఐలెరాన్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. న్యూఢిల్లీలో ఇప్పటికే కొంతమంది డీలర్లను కూడా ఎంపిక చేసుకుంది. దీని ధర రూ. 1 కోటిపైనే ఉండనుంది.
 

మరిన్ని వార్తలు