మాజీ ఎంపీ రాజయ్య భార్య మాధవి సస్పెన్షన్

3 Dec, 2015 01:35 IST|Sakshi
కోడలు సారిక ఆత్మహత్యకేసులో అరెస్టయిన మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి (ఫైల్ ఫొటో)

వరంగల్: కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ బయో టెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, మాజీ ఎంపీ రాజయ్య భార్య మాధవిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసులో నిందితురాలిగా ఉన్న రాజయ్య భార్య మాధవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 3న తెల్లవారుజామున సారిక సజీవ దహనం కాగా, అదే రోజు పోలీసులు మాధవిని అరెస్ట్ చేసినప్పటికీ పోలీసుల నుంచి రిమాండ్ రిపోర్టు అందలేదు. తాజాగా ఆ రిపోర్టు కేయూ అధికారులకు రిమాండ్ రిపోర్టు అందగా, కేయూ ఇన్‌చార్జి వీసీ చిరంజీవులు అనుమతి మేరకు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ బుధవారం మాధవిని సస్పెండ్ చేశారు.

అయితే ఈనెల 5 నుంచి మాధవిపై సస్పెన్షన్ వేటు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, మాధవి సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని ఓ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తూ 2010లో కేయూ బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యూరు. ఈ మేరకు క్యాంపస్‌లోని బయో టెక్నాలజీ విభాగంలో సుమారు రెండేళ్ల పాటు పనిచేశాక, హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి బదిలీ అయ్యూరు. కేయూ చరిత్రలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెండ్ కావడం ఇదే తొలిసారని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు