మరింత వేడెక్కిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక

16 Mar, 2017 17:51 IST|Sakshi
మరింత వేడెక్కిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక

జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక మరింత వేడెక్కింది. ఏప్రిల్ 12వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. గతంలో అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా పోటీ చేసిన ఇ. మధుసూదనన్‌ను తమ వర్గం తరఫున అభ్యర్థిగా బరిలోకి దించుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే అన్నాడీఎంకే అభ్యర్థిగా శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. డీఎంకే నుంచి మరుతు గణేశ్ పోటీలో ఉండబోతున్నారు. బీజేపీ నుంచి ప్రముఖ సినీనటి గౌతమి బరిలోకి దిగుతున్నారని వినిపించింది.

ఇక జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ పోటీ చేస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఆమె సొంతంగా పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినా, ఇప్పటివరకు ఆమెకు ఎంతమంది మద్దతుగా ఉంటారో తెలియరాలేదు. అయితే.. అవతలి నుంచి ఎంతమంది పోటీలో ఉన్నా తాను మాత్రం కనీసం 50వేల ఓట్ల మెజారిటీతో నెగ్గుతానని దినకరన్ ధీమాగా చెబుతున్నారు. పార్టీ గుర్తయిన రెండాకుల గుర్తు మీద ఈనెల 23వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. అయితే, ఆ గుర్తు తమకే చెందాలంటూ పన్నీర్ సెల్వం వర్గం ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ విషయంలో ఈసీ ఇంకా తన నిర్ణయం వెలువరించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు