మ్యాగీ మళ్లీ టాప్

23 Aug, 2016 12:10 IST|Sakshi
మ్యాగీ మళ్లీ టాప్

న్యూఢిల్లీ : ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం అనంతరం మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మ్యాగీ నూడుల్స్ మళ్లీ టాప్ స్పాట్లోకి వచ్చాయి. ఈ ఏడాది ప్రథమార్థం వరకు 57 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకుని మార్కెట్లో తన ఆధిపత్య స్థానాన్ని మ్యాగీ పునరుద్ధరించుకుంది. రీఎంట్రీ ఇచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే 57.1 శాతం మార్కెట్ షేరును మ్యాగీ కైవసం చేసుకోవడంపై నెస్లే ఇండియా ఆనందం వ్యక్తంచేస్తోంది. ఇన్ స్టెంట్ నూడుల్స్ సెగ్మెంట్లో ఆరోగ్యవంతమైందిగా మ్యాగీ నిలుస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.

మ్యాగీ నూడుల్స్లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలతో పలు రాష్ట్రాలు ఈ ఉత్పత్తులపై నిషేధం విధించాయి. ఇవి క్యాన్సర్ ముప్పుకు దారితీస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఐదు నెలల నిషేధం కాలంలో నెస్లే ఇండియా రూ.500 కోట్లకు పైగా విక్రయాలను కోల్పోవాల్సి వచ్చింది. ల్యాబ్ పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్ నాణ్యమైనవేనని తేలడంతో మళ్లీ ఉత్పత్తులను నవంబర్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. నిషేధం అనంతరం మొదటిసారి గత డిసెంబర్లో మ్యాగీకి డిమాండ్ పుంజుకుంది. మార్కెట్లోకి పునఃప్రవేశించిన ఒక నెలలోనే 35.2 శాతం మార్కెట్ షేరు పెంచుకుంది.  2016 మార్చిలోనే ఈ ఇన్ స్టెంట్ నూడుల్స్ 51 శాతం మార్కెట్ షేరును దక్కించుకున్నాయి.

మరిన్ని వార్తలు