అరుంధతి క్షమాపణ చెప్పాలి..లేదంటే..

16 Mar, 2017 18:24 IST|Sakshi
అరుంధతి క్షమాపణ చెప్పాలి..లేదంటే..

ముంబై:  రైతులకు ఇచ్చిన సాగు రుణాలను ప్రభుత్వాలు మాఫీ చేయడం మంచి సంప్రదాయం కాదన్న ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య  వ్యాఖ‍్యలపై   మహారాష్ట్ర ప్రతిపక్షం మండిపడింది. ఈ మేరకు   ముంబైలోని  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్పొరేట్ కార్యాలయం ముందు గురువారం   ఆందోళనకు  దిగింది.  పంట రుణాల ప్రోత్సాహకాలు రుణాలు తిరిగి చెల్లించే తీరును దెబ్బతీసే అవకాశం ఉండడంతోపాటు, రుణాలు తిరిగి చెల్లించే అలవాటు  కూడా తగ్గుతుందన్న వ్యాఖ్యలపై అరుంధతి  క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశాయి.  ప్రతిపక్ష కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ధర్నా నిర్వహించారు.  సుమారు గంటసేపు నిర్వహించిన ఈ ఆందోళనలో శివసేన కూడా జతచేరింది.  అసెంబ్లీలో  ప్రివిలేజ్‌ మోషన్‌  పెడతామని  హెచ్చరించాయి.

ఎస్‌బీఐ చైర్‌ పర్సన్‌ ప్రభుత్వ అధికారే తప్ప, విధాన రూపకర్త కాదని  ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్  విఖే పాటిల్ విమర్శించారు.  ఆమె పరిధికి మించి వ్యాఖ్యానించడం సరైందని కాదన్నారు.   విజయ్‌ మాల్యా  లాంటి పారిశ్రామికవేత్తలకు 1.40 లక్షల కోట్ల రుణాలను రైట్‌ ఆఫ్‌ చేసినపుడు  ఆమె ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఉత్తర ప్రదేశ్‌ లో  రుణ మాఫీ ప్రకటించినపుడు  క్రెడిట్‌ డిసిప్లీన్‌ అభ్యంతరాలను అపుడెందుకు వ్యక్తం చేయలేదని దుయ్యబట్టారు.  రైతులు  అవమానపర్చిన అరుంధతి భట్టాచార్య తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే అసెంబ్లీలో సభా హక్కుల ఉ‍ల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఆయన హెచ్చరించారు.

కాగా ముంబైలో బుధవారం సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా భట్టాచార్య ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.


 

మరిన్ని వార్తలు