ముఖ్యమంత్రిగా ఆ పని చేయడం తప్పా!

25 Oct, 2016 12:53 IST|Sakshi
ముఖ్యమంత్రిగా ఆ పని చేయడం తప్పా!

'ముఖ్యమంత్రి బ్రోకర్లా మారారు.. పాకిస్థానీలకు వత్తాసు పలుకుతున్నారు' అని మిత్రపక్షం శివసేన చేస్తోన్న తీవ్ర ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల విషయంలో నెలకొన్న ఉద్రిక్తతను పరిష్కరించే దిశగా సీఎం.. దర్శకనిర్మాతలకు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్)కు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సీఎంతో భేటీ తర్వాత రాజ్ ఠాక్రే  'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి' అని డిమాండ్ చెయ్యడంతో అందరితోపాటు ఫడ్నవిస్ కూడా ఖంగుతిన్నారట! తన అధికారిక నివాసం 'వర్ష'లో సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం అసలేంజరిగిందో చెప్పుకొచ్చారు.. (సీఎం సమక్షంలో సినిమా వివాదానికి తెర!)

'నా ముందు రెండు దారులున్నాయి. ఒకటి.. ఆ సినిమా విడుదలయ్యే అన్ని థియేటర్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడం. తద్వారా పండగ(దీపావళి)పూట పోలీసులు కుటుంబాలకు దైరంగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఆందోళనలు దారితప్పితే కొత్త సమస్యలు తలెత్తుతాయి. అందుకే నేను రెండో దారి.. అంటే చర్చలకు మొగ్గుచూపా. ఇరుపక్షాలను పిలిపించా. అక్కడ రాజ్ ఠాక్రే మూడు డిమాండ్లు మా ముందుంచారు. అందులో రెండింటికి(ఉడీ అమరజవాన్లకు నివాళులు అర్పించడం, భవిష్యత్ లో పాక్ నటులను తీసుకోకపోవడం) ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇక మూడోదైన 'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి' డిమాండ్ ను మాత్రం నేను అక్కడికక్కడే ఖండించా. సైనిక సహాయనిధికి విరాళాలు డిమాండ్ చేయడం సరికాదని రాజ్ ఠాక్రేను వారించా' అని ఫడ్నవిస్ చెప్పారు.

చర్చల ద్వారా మంచి ఫలితాన్ని రాబట్టిన తనను అభినందించాల్సిదిపోయి విమర్శలు గుప్పించడం అజ్ఞానమన్న సీఎం ఫడ్నవిస్.. కశ్మీర్ వేర్పాటువాదులతోనూ, తీవ్రవాదులతోనూ ప్రభుత్వాలు చర్చలు జరపడంలేదా?అని ప్రశ్నించారు. అమరజవాన్ల కుటుంబాలకు బాసటగా నిలవడంలో తప్పులేదని, అయితే అలా చేయాలని డిమాండ్ చేయడం మాత్రం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. ఎంఎన్ఎస్ పట్ల ప్రభుత్వానికి సాఫ్ట్ కార్నర్ ఉందన్న విమర్శలు అర్థంలేనివని అన్నారు.

మరిన్ని వార్తలు