పంకజ అలక.. సీఎం బుజ్జగింత

10 Jul, 2016 15:55 IST|Sakshi
పంకజ అలక.. సీఎం బుజ్జగింత

ముంబయి: 'ఇది మా సెక్షన్ పని కాదండి..' అని శంకర్ సినిమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు అంటారే.. దాదాపు అలాంటి సంవాదమే చోటుచేసుకుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రిణి పంకజ ముండేల మధ్య. సోమవారం సింగపూర్ లో జరగనున్న అంతర్జాతీయ జల సదస్సుకు వెళ్లబోనని, ఆ పని నాది కాదని అలక బూనిన పంకజను ముఖ్యమంత్రి ఫడ్నవిస్ బుజ్జగించి చివరకు సింగపూర్ వెళ్లేలా ఒప్పించారు. ఇంతకీ ఆమె అలకకు కారణం ఏమంటే..

గోపీనాథ్ ముండే వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పంకజ.. ఎమ్మెల్యే అవుతూనే మంత్రి పదవి చేపట్టారు. మహారాష్ట్ర జల సంరక్షణ (వాటర్ కంజర్వేషన్) మంత్రిగా ఉన్న ఆమెను.. మంత్రివర్గ విస్తరణలో భాగంగా గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖకు మార్చారు. రెండేళ్లుగా నిర్వహిస్తున్న శాఖ నుంచి ఉన్నపళంగా మార్చేయడంతో పంకజ కొద్దిగా డిసపాయింట్ అయ్యారట. అందుకే సింగపూర్ లో జరిగే కార్యక్రమాలనికి వెళ్లడం లేదని, ఆ శాఖ మంత్రిని కానుకాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నానని శనివారం ట్వీట్ చేశారు.

 

ప్రస్తుతం దుబాయి పర్యటనలో ఉన్న సీఎం ఫడ్నవిస్.. కొద్ది గంటల్లోనే పంకజ ట్వీట్ పై స్పందించారు. 'సింగపూర్ సదస్సుకు మీరు తప్పక హాజరుకావాలి. సీనియర్ మంత్రిగా అది మీ బాధ్యత. మీరు జల సంరక్షణ మంత్రిగా కాదు.. మహారాష్ట్ర ప్రభుతవ ప్రతినిధిగా సింగపూర్ వెళ్లండి' అని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతే, విమానం టికెట్లు బుక్ చేసుకునే పనిలోపడ్డారు పంకజ..

 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు