సంజయ్ పెరోల్పై విచారణకు ఆదేశించిన హోం మంత్రి

7 Dec, 2013 15:43 IST|Sakshi
సంజయ్ పెరోల్పై విచారణకు ఆదేశించిన హోం మంత్రి

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు పెరోల్పై విడుదల చేయవద్దని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆయనకు నెల రోజులు పాటు పేరోల్పై విడుదల చేయడాన్ని ఆర్పీఐ తప్పు పట్టింది. శనివారం ఎర్రవాడ జైలు వద్ద పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. సంజయ్ దత్ను మిగిలిన ఖైదీలతో సమానంగా చూడాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

 

తన భార్య మన్యత అనారోగ్యంతో ఉందని, ఈ నేపథ్యంలో తనను నెల రోజులు పెరోల్పై విడుదల చేయాలని ఆయన జైలు అధికారులను అభ్యర్థించారు. అయితే జైలు అధికారులు ఆ విషయాన్ని కోర్టుకు నివేదించారు. దాంతో సంజయ్ దత్తు పెరోల్పై విడుదల చేసేందుకు కోర్టు అనుమతించింది. అయితే సంజయ్కు పెరోల్ రావడం పట్ల పలు ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

 

బాలీవుడ్ నటుడు అయినంత మాత్రాన ఎప్పుడు కోరితే అప్పుడు సంజయ్ దత్ను పెరోల్పై విడుదల చేస్తారా అంటూ ధ్వజమెత్తాయి. దాంతో ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆ అంశంపై విచారణకు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి ఆర్ ఆర్ పాటిల్ ఆదేశించారు. దీనిపై త్వరిత గతిన విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

 

తీవ్ర అనారోగ్యం కారణంగా ఇప్పటికే సంజయ్ దత్ రెండు సార్లు ఎర్రవాడ జైలు నుంచి పెరోల్పై విడుదల అయిన సంగతి తెలిసిందే. 1993 ముంబయి బాంబు పేలుళ్లలో సంజయ్ దత్ నిందితుడని సుప్రీంకోర్టు ధృవీకరించింది. ఆ కేసులో సంజయ్ దత్కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు