మేడిన్ ఇండియా ఈ-బైక్!

12 Jul, 2015 01:32 IST|Sakshi
మేడిన్ ఇండియా ఈ-బైక్!

విద్యుత్తుతో నడిచే బైక్ వాడితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ విషయం మనకు తెలిసినా ఈ బైక్ వాడేందుకు ఇష్టపడం. ఎందుకు? వేగం తక్కువ... ఒకట్రెండేళ్లకే బ్యాటరీ మార్చుకోవాలి. బ్యాటరీ చార్జింగ్‌కు బోలెడంత టైమ్ పడుతుంది. ఇవేనా మీరు చెప్పే కారణాలు? అయితే ఇంకొక్క ఏడాది ఆగండి. ఈ చిక్కులేవీ లేని ఈ బైక్ మీ ముందుకు రాబోతుంది. పైగా ఇది పక్కా మేడిన్ ఇండియా బైక్! మద్రాస్ ఐఐటీ విద్యార్థులు నాలుగేళ్లుగా శ్రమించి తయారు చేసిన ఈ ‘ఎస్ 340’ (ఫొటోలో కనిపిస్తున్నది) నమూనాలను ఇప్పటికే కొందరు పరీక్షిస్తున్నారు.

మీ స్మార్ట్‌ఫోన్ కంటే వేగంగా... కచ్చితంగా చెప్పాలంటే ఒక గంటలో దీని బ్యాటరీని రీచార్జ్ చేసుకోవచ్చు. అంతేకాదు, దాదాపు 50 వేల కిలోమీటర్ల ప్రయాణం వరకూ బ్యాటరీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అత్యాధునిక కంప్యూటర్ మైక్రోప్రాసెసర్లు, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్లు ఉపయోగించారు. అన్నింటికీ మించి ఎస్ 340 గరిష్ట వేగం గంటకు 75 కిలోమీటర్లు! అబ్బో భలే ఉందే ఈ బైక్ మనమూ ఒకటి కొందామనుకుంటున్నారా? వచ్చే ఏడాది దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశముంది. ధర ఎంత ఉంటుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్! మరిన్ని వివరాలకు http://atherenergy.com/ వెబ్‌సైట్ చూడండి.
 

>
మరిన్ని వార్తలు