ఔను! ఆ ఫోన్లు ఇక చౌకధరకే లభిస్తాయ్‌!

3 Jul, 2017 12:08 IST|Sakshi
ఔను! ఆ ఫోన్లు ఇక చౌకధరకే లభిస్తాయ్‌!

'మేకిన్‌ ఇండియా'కు కేంద్ర ప్రభుత్వం భారీ  ప్రోత్సాహకాన్నే ప్రకటించింది. ఇకనుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్న మొబైల్‌ ఫోన్లపై పదిశాతం ప్రాథమిక కస్టమ్స్‌ సుంకం విధించనున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చే చార్జర్లు, హెడ్‌సెట్లు, బ్యాటరీలు, యూఎస్‌బీ కేబుళ్లకు కూడా ఈ సుంకం వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ప్రకటించిన ఈ నిర్ణయంతో 'మేడ్‌ ఇన్‌ ఇండియా' మొబైల్‌ ఫోన్లు చౌక ధరకే వినియోగదారులకు లభించే అవకాశముంది.

గతంలో స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో 11.5శాతం వరకు వివిధ సుంకాలు కేంద్ర ప్రభుత్వం విధించేది. జీఎస్టీ రాకతో ఆ సుంకాలు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే హైఎండ్‌ టాప్‌ మొబైల్‌ ఫోన్ల ధరలు తగ్గే అవకాశముందని భావించారు. అయితే, తాజాగా కేంద్రం విదేశాల నుంచి వస్తున్న ఫోన్లపై సుంకం విధించడంతో మళ్లీ దేశీయ ఉత్పత్తులకు అనుకూలంగా వ్యవహరించినట్టు అయింది.

అయితే, దేశీయ మొబైల్‌ తయారీదారులు ఎక్కువగా దిగుమతి చేసుకునే సర్క్యూట్ బోర్డు అసెంబ్లీ (PCBA), కెమెరా మాడ్యూల్, టచ్ పానెల్, కవర్ గ్లాస్ అసెంబ్లీ, వైబ్రేటర్ మోటార్, రింగర్ లను ఈ ప్రాథమిక సుంకం నుంచి మినహాయించింది. దీంతో దేశీయంగా ఉత్పత్తి అయ్యే మొబైల్‌ ఫోన్లపై 12శాతం జీఎస్టీ మాత్రమే వర్తించనుంది. ఈ లెక్కన విదేశీ మొబైల్‌ ఫోన్లతో పోలిస్తే దేశీయంగా తయారయ్యే ఫోన్లు తక్కువ ధరకు వినియోగదారులకు లభించే అవకాశముందని మొబైల్‌ ఫోన్‌ కంపెనీలు చెప్తున్నాయి. 

మరిన్ని వార్తలు