తరగతి పరీక్షలపై మలాలా బెంగ!

12 Oct, 2014 17:27 IST|Sakshi
తరగతి పరీక్షలపై మలాలా బెంగ!

లండన్: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైన మలాలా యూసఫ్‌జాయ్(17) సందిగ్ధంలో పడింది. నోబెల్ అవార్డు తీసుకునే సమయంలోనే తరగతి పరీక్షలకు హాజరవుతున్నందున మలాలా బెంగపెట్టుకుంది. ప్రస్తుతం బర్మింగ్ హమ్ లో తన తల్లి దండ్రులతో కలసి ఉన్న మలాల నోబెల్ అవార్డును గెలుచుకున్న ఆనందంలో ఉన్నా.. త్వరలో జరుగనున్న స్కూలు పరీక్షలపై ఆందోళన చెందుతోంది. నోబెల్ అవార్డు తీసుకునే సమయం.. పరీక్షల సమయం ఒకేసారి రావడంతో ఆమె కలత చెందుతున్నట్లు పేర్కొంది. బాలికల విద్యా హక్కు కోసం ధైర్యంగా, సాహసోపేతంగా పోరాడిన మలాలాకు నోబెల్ అవార్డుతో కొత్త సమస్య వచ్చిపడటం ఆసక్తికరంగా మారింది.

 

గత రెండు సంవత్సరాల క్రితం తాలిబన్లు తుపాకీ దాడుల్లో తీవ్రంగా గాయపడిన మలాలా అనంతరం మెదడుకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకుని కోలుకున్న సంగతి తెలిసిందే. నోబెల్ అవార్డు గెలుచుకున్న తరువాత ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటూర్యూలో పలు విషయాలను వెల్లడించింది. 'ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నిజంగా గొప్ప గౌరవం. ప్రజలు చూపించిన ప్రేమతోనే నేను తిరిగి బయటపడ్డాను'అని పేర్కొంది. 'నాకు అవార్డు వచ్చే విషయంలో నా టీచర్లే ఎక్కువ ఆసక్తి చూపారు. అవార్డు వచ్చినట్లు ప్రకటించాక వారే ఎక్కువగా ఆనంద పడ్డారు' అని మలాలా పేర్కొంది. అవార్డు వచ్చే సమయంలో కెమిస్ట్రీ టీచర్ వద్ద తాము ఒక పాఠ్యాంశాన్ని నేర్చుకుంటున్నామని మలాలా తెలిపింది. అయితే తన వద్ద ఎటువంటి సెల్ ఫోన్ లేకపోవడంతో ఆ విషయాన్ని తన టీచర్లే  తెలిపినట్లు మలాలా పేర్కొంది.

>
మరిన్ని వార్తలు