'ఆ పని చేస్తున్నది పాకిస్థానీలే'

15 Apr, 2017 15:27 IST|Sakshi
'ఆ పని చేస్తున్నది పాకిస్థానీలే'
  • ఇస్లాంకు, దేశానికి చెడ్డపేరు తెస్తున్నారు
  • ఇస్లాం సందేశానికి చావుగంట మోగిస్తున్నారు
  • సొంత దేశంపై తీవ్రంగా విరుచుకుపడ్డ మాలాలా

  • న్యూఢిల్లీ: సొంత దేశం పాకిస్థాన్‌పై తీవ్రంగా విరుచుకుపడుతూ తాజాగా నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయి ఓ వీడియో సందేశాన్ని వెలువరించారు. 'దైవదూషణ'కు పాల్పడ్డాడన్న నెపంతో ఇటీవల పాకిస్థాన్‌లో ఓ యూనివర్సిటీ విద్యార్థిని దారుణంగా కొట్టిచంపారు. ఈ ఘటనను పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్‌కు చెడ్డపేరు రావడానికి మరెవరో కాదు పాకిస్థానీలే కారణమని ఆమె విమర్శించారు.

    'మనం ఇస్లామోఫోబియా గురించి మాట్లాడుతాం. మన దేశానికి, మన మతానికి ప్రజలు ఎలా చెడ్డపేరు తెస్తున్నారో మాట్టాడుతాం. కానీ, ఇతరులెవరూ మన దేశానికి, మన మతానికి చెడ్డపేరు పెట్టడం లేదు. అది మనకు మనమే చేస్తున్నాం. అందులో మనం సరిపోతాం' అంటూ ఆమె తప్పుబట్టారు.

    గురువారం 23 ఏళ్ల జర్నలిజం విద్యార్థి మషాల్‌ ఖాన్‌ను యూనివర్సిటీ పరిసరాల్లోనే పట్టపగలు అతి కిరాతకంగా ఓ మూక కేకలు పెడుతూ హతమార్చింది. ఫేస్‌బుక్‌లో 'దైవదూషణ' చేశాడన్న ఆరోపణలతో ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. మషాల్‌ ఖాన్‌ను క్రూరంగా కొట్టిచంపడమే కాదు.. అతని మృతదేహాన్ని కాలేశారు. అతడు ప్రాణాలు కోల్పోయి నిర్జీవంగా పడి ఉన్నా.. అతని మృతదేహాన్ని కట్టెలతో కొడుతూ కసి తీర్చుకున్నారు. ఈ దారుణమైన ఘటన నేపథ్యంలో మలాలా మృతిచెందిన విద్యార్థి తండ్రితో మాట్లాడారు. ఇంతటి దారుణం తన కొడుకుపై జరిగినా, సమాజంలో శాంతి, సహనం నెలకొనాలంటూ ఆయన సందేశమిచ్చారని ఆమె చెప్పారు.

    'ఈ ఘటన మషాల్‌ హత్యకు సంబంధించినదే కాదు. ఇది ఇస్లాం సందేశానికి చావుగంట మోగించడమే. మనం మన మతాన్ని మరిచిపోయాం. మనం మన విలువల్ని, సభ్యతని మరిచిపోయాం' అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.   

     

మరిన్ని వార్తలు