మలేసియా విమానం:అతి ఖరీదైన అన్వేషణగా రికార్డ్

8 Apr, 2014 20:48 IST|Sakshi
విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషణ

పెర్త్: తప్పిపోయిన  మలేసియా విమానం గాలింపు  అతి ఖరీదైన అన్వేషణగా రికార్డులకు ఎక్కనుంది. కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో చైనా రాజధాని బీజింగ్ బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ బోయింగ్ 777 విమానం ఎంహెచ్370 గత నెల 8వ తేది  అదృశ్యమైన విషయం తెలిసిందే. ఇందులో అయిదుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఈ విమానం కోసం 26 దేశాలకు చెందిన వైమానిక, నావికా దళాలు గాలించాయి.

ఈ విమానం కోసం  నెలరోజుల అన్వేషణకు ఇప్పటికే నాలుగు కోట్ల 40 లక్షల అమెరికన్ డాలర్లు ఖర్చయినట్లు రాయిటర్స్ అంచనా. 2009లో కూలిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం కోసం రెండేళ్లు గాలించారు.  దానికి అయిన ఖర్చుతో ఇది దాదాపుగా సమానం.

ఇదిలా ఉండగా, ఈ విమానం బ్లాక్ బాక్స్ కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా ఈ  అన్వేషణలో 11 మిలటరీ విమానాలు, మూడు పౌర విమానాలు, 14 షిప్లు పాల్గొన్నాయి.
 

>
మరిన్ని వార్తలు