ఆ విమానం హిందూమహాసముద్రంలోనే కూలిందా?

19 Mar, 2014 13:21 IST|Sakshi
ఆ విమానం హిందూమహాసముద్రంలోనే కూలిందా?

పది రోజులకు పైగా కనిపించకుండా పోయిన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం హిందూ మహాసముద్రంలో ఉందన్న తాజా వాదన ఒకటి తెరమీదకు వచ్చింది. 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు బయల్దేరిన ఈ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్న విషయం తెలిసిందే. వీరి క్షేమ సమాచారం ఏదీ ఇంతవరకు అందకపోవడంతో ప్రయాణికుల బంధుమిత్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈనెల 8వ తేదీన బయల్దేరిన ఈ విమానం ఇప్పుడు బహుశా హిందూ మహా సముద్రంలో దక్షిణ దిశగా ఉండొచ్చని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న మలేషియన్ అధికార వర్గాలు ఇప్పుడు భావిస్తున్నాయి. అది దక్షిణ దిశగానే వెళ్లిందని, ఇండోనేసియాకు దక్షిణ దిశ నుంచి ఆస్ట్రేలియాకు పశ్చిమదిశగా హిందూ మహాసముద్రంలో కూలిపోయి ఉండొచ్చని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆసియా వైపు వెళ్తే మాత్రం అత్యంత శక్తిమంతమైన భారత్, చైనా రాడార్ల దృష్టిని కన్నుగప్పి ప్రయాణం చేసే అవకాశం లేనే లేదని దర్యాప్తు అధికారులు గట్టిగా చెబుతున్నారు.

చైనా సరిహద్దుల్లో అత్యంత శక్తిమంతమైన సైనిక రాడార్లున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా ఆధీనంలో ఇవి పనిచేస్తాయి. అలాగే, భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు కూడా అత్యంత సున్నితమైనది కావడంతో అక్కడ సైతం సైనిక పర్యవేక్షణ చాలా పటిష్ఠంగా ఉంటుంది. ఇటువైపు నుంచి ఒక జెట్ విమానం వెళ్లడం, దాన్ని ఏ దేశం వాళ్లూ గుర్తించలేకపోవడం అనేది అసాధ్యమేనని ఇంటెలిజెన్స్ మాజీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. పైపెచ్చు, విమానం నుంచి ఏ సిగ్నల్ వెళ్లినా.. దాన్ని కచ్చితంగా గుర్తించే పరిజ్ఞానం ఉందని, అందువల్ల అది హిందూ మహాసముద్రంలో కూలిపోయే ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు