ప్రముఖ హీరోయిన్‌పై ముసుగు వ్యక్తుల దాడి

17 Nov, 2016 19:07 IST|Sakshi
ప్రముఖ హీరోయిన్‌పై ముసుగు వ్యక్తుల దాడి

ప్రముఖ బాలీవుడ్‌ నటి మల్లికా షెరావత్‌పై పారిస్‌లో దాడి జరిగింది. ముఖానికి ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు పారిస్‌లోని  ఆమె అపార్ట్‌మెంట్‌ బ్లాక్‌లోకి చొరబడి.. దాడి చేశారు. మొదట టియర్‌గ్యాస్‌ విడుదల చేసి.. అనంతరం ఆమెపై ముగ్గురు దుండగులు పిడిగుద్దులు కురిపించారు. నెలరోజుల కిందట పారిస్‌లోనే హాలీవుడ్‌ స్టార్‌ కిమ్‌ కర్దాషియన్‌పై దోపిడీ దొంగలు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఇదే రీతిలో ఆమెపై దాడి జరిగింది.

గత శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో తన ప్రియుడు, ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త సిరిల్‌ ఆక్సన్‌ఫాన్స్‌తో కలిసి తన ఫ్లాట్‌లోకి వెళ్లిన తర్వాత ముగ్గురు దుండగులు చొరబడి ఈ దాడి చేశారు. ముగ్గురు దుండగులు ముఖానికి మాస్క్‌లు తొడిగారని, ఏమి మాట్లాడకుండా వస్తూనే టియర్‌గ్యాస్‌ విడుదల చేసి అనంతరం దాడి చేశారని లే పారిసీన్‌ దినపత్రిక తెలిపింది. ఈ ఘటనతో షాక్‌ తిన్న మల్లిక వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు కేసు నమోదుచేసుకొని దుండగుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు