ముఖ్యమంత్రికి భారీ షాక్.. సీబీఐ చేతికి కేసు!

17 Mar, 2017 17:32 IST|Sakshi
ముఖ్యమంత్రికి భారీ షాక్.. సీబీఐ చేతికి కేసు!

నారదా న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికేసిన టీఎంసీ నేతల కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు నిర్ణయించింది. దీంతో పశ్చిమబెంగాల్ ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. ఈ స్టింగ్ ఆపరేషన్ సీడీలు బీజేపీ కార్యాలయం నుంచి ప్రసారం అయ్యాయన్న విషయం అందరికీ తెలుసని, అయితే ఇప్పుడు తాను దీనిపై వ్యాఖ్యానించేది ఏమీ లేదని, ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తానని మమతా బెనర్జీ అన్నారు. సరిగ్గా 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది ముందు ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరపాలని, 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిషితా మాత్రే, జస్టిస్ టి. చక్రవర్తి ఆదేశించారు. అవసరమైతే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలన్నారు.

ఈ కేసు విచారణను ఒక స్వతంత్ర కేంద్ర సంస్థకు అప్పగించే అవకాశాలున్నాయని కలకత్తా హైకోర్టు జనవరిలోనే చెప్పింది. ఈ కేసులో సాక్ష్యాలను బట్టి చూస్తే సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం కనిపిస్తోందని జస్టిస్ మాత్రే వ్యాఖ్యానించారు. అప్పటికి రాష్ట్ర పోలీసులే కేసును విచారిస్తుండటంతో.. విచారణ సక్రమంగా సాగట్లేదన్న అభిప్రాయంతో కోర్టు ఇలా వ్యాఖ్యానించి ఉంటుందని భావిస్తున్నారు.

ఏమిటీ ఆపరేషన్..
గత సంవత్సరం మార్చి నెలలో సరిగ్గా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొద్ద ముందు నారదా న్యూస్ చానల్ రెండు సీడీలను బయటపెట్టింది. అందులో పలువురు టీఎంసీ నాయకులు లంచాలు తీసుకుంటున్న వ్యవహారం మొత్తం రికార్డయింది. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ దీనిపై వివరణ కోరింది. సీడీలలో ఐదుగురు టీఎంసీ ఎంపీలు కూడా ఉండటంతో వారు వివరణ ఇవ్వాలని తెలిపింది. టీఎంసీ విద్యార్థి విభాగం నాయకుడు కూడా ఇందులో ఉన్నాడు.

మరిన్ని వార్తలు