ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

14 Sep, 2015 22:35 IST|Sakshi

మాదాపూర్: ప్రముఖ ఐటీ కంపనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ యువకుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన హర్షత్ నవీన్ (28) ఎంబీఏ పూర్తి చేసి ఓ ప్రై వేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారి సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిరుద్యోగులను మోసం చేయడం ప్రారంభించాడు.

ఇందులో భాగంగానే నౌకరి, మాన్‌స్టర్ జాబ్ పోర్టల్ నుంచి నిరుద్యోగుల వివరాలు సేకరించి వారికి నకిలి ఈ-మెయిళ్లు పంపించాడు. సుమారు 8 మంది నిరుద్యోగుల దగ్గర నుంచి రూ. 8 లక్షల వసూలు చేసి పారిపోయాడు. ఎటువంటి అనుమానం రాకుండా ఐల్యాబ్స్, రహేజా మాక్స్ మాస్ లలో దొంగ ఇంటర్వ్యూలు సైతం చేయించాడు. వేణుగోపాల్ అనే వ్యక్తి సహకరించాడు. ప్రస్తుతం వేణుగోపాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హర్షత్ నవీన్‌ను రిమాండ్‌కు పంపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు