అప్పు తీర్చనందుకు 14 ఏళ్ల వనవాసం

1 Feb, 2016 08:54 IST|Sakshi

తండ్రికి ఇచ్చిన మాట కోసం రాముడు అడవులకు వెళ్లాడు. జూదంలో ఓడి పాండవులు వనవాసం, అజ్ఞాతవాసం కూడా చేశారు. కానీ.. కేవలం రూ. 50 వేల అప్పు తీర్చలేక ఓ వ్యక్తి ఈ ఆధునిక కాలంలో కూడా 14 ఏళ్ల పాటు వనవాసం చేయాల్సి వచ్చింది. అంతేకాదు, తనకున్న 2.29 ఎకరాల భూమి కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదంతా కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో జరిగింది. చంద్రశేఖర గౌడ (43) 1999 సంవత్సరంలో నెల్లూరు కెమరాజె సహకార సంఘం నుంచి రూ. 50,400 అప్పు తీసుకున్నారు. ఆ అప్పును ఆయన తీర్చలేకపోవడంతో సొసైటీ ఆయనకు చెందిన 2.29 ఎకరాల భూమిని 2002లో రూ. 1.20 లక్షలకు వేలం వేసింది. పొలంలోనే ఉన్న ఆయన ఇంటిని కూల్చేశారు.

చివరకు ఏమీ చేయలేక ఆయన దాదాపు 14 ఏళ్ల పాటు అడవుల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. సులియా సమీపంలోని అడవులకు వెళ్లిన ఆయన.. ఓ సెకండ్ హ్యాండ్ కారు తీసుకుని, దాన్నే తన ఇంటిగా మార్చుకున్నారు. అక్కడ బుట్టలు అల్లుకుని ఆయన జీవనం కొనసాగించారు. ప్రతి రోజూ అడవి నుంచి 21 కిలోమీటర్ల దూరం నడిచి సులియా వెళ్లి, తాను అల్లిన బుట్టలను ఒక్కోటీ రూ. 40 వంతున అమ్ముతున్నారు. గౌడ కష్టాలు చూసి చలించిన జిల్లా అధికారులు ఆయనకు పునరావాసం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు