246 కోట్లు డిపాజిట్‌.. ఎంత పన్ను కట్టాడంటే?

26 Mar, 2017 14:04 IST|Sakshi
246 కోట్లు డిపాజిట్‌.. ఎంత పన్ను కట్టాడంటే?

చెన్నై: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలలో దాదాపు 200 మంది ఆదాయపన్ను పరిమితికి మించి అత్యధికస్థాయిలో బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారు. వివిధ బ్యాంకులలో వీరు రూ. 600 కోట్లకుపైగా డిపాజిట్‌ చేశారు. తమిళనాడులో ఎక్కువశాతం గ్రామీణ ప్రాంతాలలో పరిమితి మంచి అధికస్థాయిలో డిపాజిట్లు కావడం గమనార్హం. చెన్నైలోనూ కొన్నిచోట్ల అధికమొత్తం డిపాజిట్లు వచ్చాయని, కొన్ని సబ్‌ అర్బన్‌ ప్రాంతాల్లోనూ, నగరాలకు సమీపంగా ఉన్న జిల్లా కేంద్రాల్లోనూ పెద్దమొత్తంలో పాతనోట్ల డిపాజిట్‌ అయ్యాయని ఐటీ వర్గాలు వివరించాయి.

ఒకే వ్యక్తి.. 246 కోట్ల డిపాజిట్‌..
నమక్కల్‌ జిల్లా తిరుచెంగోడికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 246 కోట్ల పాతనోట్లను డిపాజిట్‌ చేశాడు. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు శాఖలో అతను ఈ మొత్తాన్ని జమ చేశాడు. దీని గురించి ఐటీ అధికారులు ఆరాతీసినా.. మొదట ముందుకు రావడానికి అతను సిద్ధపడలేదు. తన వివరాలు దాచేందుకు ప్రయత్నించాడు. అయితే, దాదాపు 15 రోజులపాటు అన్వేషించిన ఐవోబీ రూరల్‌ బ్యాంకులో అతను డిపాజిట్‌ చేసినట్టు తాము గుర్తించామని, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన (పీఎంజీకేవై) కింద ఈ మొత్తం డిపాజిట్‌కుగాను 45శాతం పన్ను కట్టేందుకు అతన్ని ఒప్పించామని ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ పథకం కింద రూ. 246 కోట్లకు 45శాతం పన్ను కట్టడమే కాదు.. మొత్తంలో 25శాతాన్ని వడ్డీలేని డిపాజిట్‌గా ప్రభుత్వం తన వద్ద కొంతకాలం అట్టిపెట్టుకోనుందని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు