ఊటీలో నరభక్షక పులి కాల్చివేత

23 Jan, 2014 11:21 IST|Sakshi
ఊటీలో నరభక్షక పులి కాల్చివేత

పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన ఊటీ జిల్లాలో గ్రామస్థులకు నరభక్షక పులి బాధ ఎట్టకేలకు తీరింది. ముగ్గురు వ్యక్తులతో పాటు.. రెండు ఆవులు, మరో రెండు మేకలను కూడా చంపి తిన్న ఆ పులిని అటవీ శాఖాధికారులు, పోలీసులు కలిసి కాల్చిచంపారు. తొలిసారి ఈ పులి ఈనెల 5వ తేదీన కనిపించింది. అప్పటినుంచి రెండు వారాల పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ నరకం చూపించింది. కుండచప్పాయ్ గ్రామ సమీపంలో అటవీ శాఖాధికారులు ఎట్టకేలకు కాల్చిచంపారని, తుపాకి గుళ్లు తగిలిన తర్వాత కనిపించకుండా పోయిన పులి మృతదేహాన్ని దాదాపు గంట తర్వాత స్వాధీనం చేసుకున్నారని నీలగిరి జిల్లా కలెక్టర్ పి.శంకర్ తెలిపారు.

అంతకు ముందు ఈ పులి ముగ్గురు వ్యక్తులను చంపి తినేసింది. ఈ పులి కారణంగా ఆ ప్రాంతంలోని పాఠశాలలన్నింటినీ మూసేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి. సాయంత్రం కావడానికి ముందే జనమంతా ఇళ్లకు పరుగులు తీశారు. టీ ఎస్టేట్లు, పండ్లు, కూరగాయల తోటల్లో కూడా పనివేళలను తగ్గించారు. అటవీ శాఖాధికారులు ఎంతకూ దాన్ని వేటాడేందుకు ముందుకు రాకపోవడంతో బుధవారం నాడు దాదాపు 600 మంది గ్రామస్థులు కత్తులు, కొడవళ్లు పట్టుకుని అడవిలోకి బయల్దేరారు. అయితే, వాళ్లుంటే వేటకు ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్పారు. శిక్షణ పొందిన ఏనుగులను తీసుకుని పులివేటకు బయల్దేరారు. కెమెరా ట్రాప్లు పులి ఆనవాళ్లను గుర్తించగలిగామని డీఎఫ్ఓ తెలిపారు. తిండిలేక అది నీరసంగా కనిపించిందని, గాయాలు కూడా కావడంతో రక్తపు మరకలు కూడా కనిపించాయని అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు