'మా ఆవిడను చంపాలి.. సాయం చేయండి'

16 Feb, 2017 22:45 IST|Sakshi
'మా ఆవిడను చంపాలి.. సాయం చేయండి'
తన భార్యను చంపడానికి కిరాయి హంతకులను మాట్లాడుకుందాం అనుకుని టెక్స్ట్ మెసేజ్ పంపాలనుకున్న ఓ వ్యక్తి.. పొరపాటున దాన్ని కిరాయి హంతకుడికి బదులు తన మాజీ బాస్‌కు పంపేశాడు. తన భార్యతో పాటు నాలుగేళ్ల కూతురిని కూడా చంపాలనుకోవడంతో జెఫ్రీ స్కాట్ లైటిల్ (42)ను పోలీసులు అరెస్టు చేశారు. ఎవరో షేన్ అనే వ్యక్తికి అతడు ఈ మెసేజ్ పంపాలని అనుకున్నాడు. అయితే అనుకోకుండా అది అతడి మాజీ బాస్‌కు వెళ్లడంతో కుట్ర మొత్తం ముందే తెలిసిపోయింది. ''హే షేన్, పని ఎలా నడుస్తోంది? మా భార్యను చంపడానికి నువ్వు సాయం చేస్తానని చెప్పావు గుర్తుందా, ఆ ఆఫర్ గురించి నీకు చెబుదామనుకున్నా'' అని మెసేజ్ పెట్టాడు. 
 
తన భార్య మరణిస్తే బీమా సొమ్ము వస్తుందని, అది దాదాపు 6.68 కోట్ల రూపాయలు ఉంటుందని, అలాగే తన నాలుగేళ్ల కూతురిని కూడా చంపితే మరో 3.34 కోట్ల రూపాయలు వస్తుందని అతడు తన మెసేజ్‌లో తెలిపాడు. ఆ మొత్తాన్ని పంచుకోవచ్చని అన్నాడు. తాను తెల్లవారుజామున 5 గంటలకే ఉద్యోగానికి వెళ్లిపోతానని, తన భార్య మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తుందని, అందువల్ల దోపిడీ ప్రయత్నంలా చేయొచ్చు లేదా ప్రమాదంలా చిత్రీకరించవచ్చని కూడా సూచించాడు. మొత్తం బీమా సొమ్మును సగం సగం పంచుకుందామని ఆఫర్ ఇచ్చాడు. 
 
దాంతో హత్యాయత్నం కేసు కింద లైటిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాను తన భార్య, కూతుళ్లను చంపాలనుకోలేదని, తాను వేరే మహిళతో మాట్లాడానని ఆమె గొడవ పెట్టుకోవడంతో చిన్నపాటి వివాదం మాత్రమే చెలరేగిందని అన్నాడు. బహుశా తన కూతురు ఆ మెసేజ్ పంపి ఉంటుందని తెలిపాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చివరకు నేరాన్ని అంగీకరించాడు.
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు