అప్పులు తీర్చేందుకు సొంతంగా నోట్ల ముద్రణ!

14 Aug, 2017 13:38 IST|Sakshi
అప్పులు తీర్చేందుకు సొంతంగా నోట్ల ముద్రణ!

గుజరాత్‌లో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు

సూరత్‌: రవీగాంధీ నిన్నమొన్నటి వరకు విదేశీ విద్యాసేవల కన్సల్టెన్సీని నడిపేవాడు. ఈ కన్సల్టెన్సీని బాగా నడిపేందుకు రూ. 70 లక్షల వరకు అప్పులు తెచ్చాడు. అయితే, కన్సల్టెన్సీలో భారీగా నష్టాలు రావడంతో అప్పులు తిరిగి చెల్లించలేకపోయాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు మీద పడటంతో వాటిని చెల్లించేందుకు ఓ పథకం వేశాడు. అదే సొంతంగా నోట్లు ముద్రించడం. నకిలీ నోట్లను తానే ముద్రించి.. వాటిని మార్కెట్‌లో చెలామణి చేయడం ద్వారా అప్పులు తీర్చాలనుకున్నాడు. లక్ష రూపాయల అసలు కరెన్సీ నోట్లకు రూ. 3లక్షల నకిలీ నోట్లు ఇచ్చే పథకంతో అతను తన అనుచరులతో మార్కెట్‌లోకి దిగాడు. కానీ పోలీసులకు సమాచారం అందడంతో అతని బండారం బట్టబయలు అయింది. గుజరాత్‌లోని సూరత్‌ పట్టణంలో భారీ నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టయింది.

వారి వద్ద నుంచి రూ. 40.73 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సుత్రధారి అయిన రవీగాంధీ (30)తోపాటు అతని అనుచరులు అజయ్‌ పటేల్‌, బాబులాల్‌ అలియాస్‌ బాబ్లూ మహాదేవ్‌ వాంఖడే, వాసులను అరెస్టు చేశారు. విదేశాల్లో చదువుకునేవారి కోసం కొన్నాళ్లు కన్సల్టెన్సీ నడిపిన రవీగాంధీ.. నష్టాలు వచ్చి పెద్ద మొత్తంలో అప్పులు చేయడంతో..వాటిని తిరిగి చెల్లించేందుకు నకిలీ కరెన్సీ ముఠాకు తెరతీశాడని పోలీసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు