చంద్రబాబు నంబర్ వన్ చీటర్

5 Feb, 2016 02:55 IST|Sakshi
చంద్రబాబు నంబర్ వన్ చీటర్

- మంద కృష్ణ
 తుని ఘటనను జగన్‌కి అపాదించడం దుర్మార్గమని విమర్శ

మంగళగిరి/రేపల్లె: ముఖ్యమంత్రి చంద్రబాబు నంబర్ వన్ చీటర్, పరమ విశ్వాసఘాతకుడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తీవ్రస్థాయిలో విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి, రే పల్లెల్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తుని ఘటనను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అపాదించి చంద్రబాబు తన దిగజారుడు రాజకీయాన్ని మరోసారి ప్రదర్శించారని విమర్శించారు.

జగన్ కారణమైతే ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తుని ఘటనకు చంద్రబాబు బాధ్యతారాహిత్యమే కారణమని చెప్పారు. ఎన్నికలకు ముందు పెద్దమాదిగై ఉంటానని మాదిగల ఓట్లు పొంది అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కి మాదిగలను మోసం చేసినట్లే..  కాపులను కూడా మోసం చేస్తున్నారన్నారు. వర్గీకరణకు సంబంధించి  తాడోపేడో తేల్చుకునేందుకు ఏప్రిల్ 30న చంద్రబాబు ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆక్కడే 10లక్షల మందితో  విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

చంద్రబాబు వేసిన రామచంద్రన్ , కేంద్రప్రభుత్వం వేసిన ఉషామెహ్రా కమిషన్‌లు వర్గీకరణకు అనుకూలంగా  నివేదికలు ఇచ్చినా అమలుచేయని బాబు.. ఇప్పుడు కాపుల కోసం మంజునాథ్ కమిటీ నివేదికను అమలు చేస్తారన్న న మ్మకమేమిటని ప్రశ్నించారు. ఆయనకు కమిషన్ నివేదికలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు