కళ్లు తెరిచారు.. కల్లు మానేశారు!

7 Nov, 2015 05:10 IST|Sakshi
కళ్లు తెరిచారు.. కల్లు మానేశారు!

కోహీర్: కల్తీకల్లును పారదోలేందుకు మనియార్‌పల్లి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఇకపై కల్లు విక్రయాలు జరగనివ్వమని గాంధీ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోకి వచ్చిన కల్లు లారీని తరిమికొట్టారు. ఇటీవల కల్లు రేటు విషయమై చెలరేగిన వివాదం నిషేధానికి దారితీసింది. ఇదివరకు మనియార్‌పల్లి గ్రామంలో రూ.8కు కల్లు సీసా అమ్మేవారు. గిట్టుబాటు లేక కాంట్రాక్టర్ సీసా రేటు రూ.10కి పెంచాడు. దీంతో మద్యంప్రియులు, కాంట్రాక్టరు మధ్య వివాదం చెలరేగడంతో పంచాయితీ గ్రామపెద్దల వద్దకు చేరింది.

శుక్రవారం ఉదయం వారంతా సమావేశ మై.. కల్తీకల్లు వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. దీంతో కల్లును నిషేధించాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విషయాన్ని కోహీర్ పోలీసులకు తెలిపారు.
 
ఏఎస్‌ఐ రాములు గ్రామానికి చేరుకొని కల్లును నిషేధంపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. సంపూర్ణ మద్య నిషేధం కోసం వచ్చే ఆదివారం తిరిగి సమావేశ మవుతామని గ్రామపెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖదీర్, ఉపసర్పంచ్ ఎం.రాములు, గ్రామపెద్దలు సాయిరెడ్డి, నవాజ్ పటేల్, ఇస్మాయిల్, పాండునాయక్, నర్సిములు, అంజయ్య, మల్లప్ప, పోచయ్య, కిష్టయ్య, ఆశయ్య, గోపాల్, అనంత్‌రామ్, సత్యమ్మ, పోచమ్మ, నర్సమ్మ తదితరులున్నారు.
గాంధీ విగ్రహం ఎదుట ప్రజల ప్రతిజ్ఞ

మరిన్ని వార్తలు