జీ20 దేశాలకు ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపు

6 Sep, 2013 02:42 IST|Sakshi
జీ20 దేశాలకు ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపు
సెయింట్ పీటర్స్‌బర్గ్ (రష్యా):  వర్ధమాన దేశాల్లో వృద్ధిని పునరుద్ధరించే దిశగా జీ-20 కూటమి సమిష్టిగా పనిచేయాలని ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించారు. తద్వారా ప్రపంచ ఎకానమీ కోలుకునేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు. ఎన్నడూ లేనంతగా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించి, అనూహ్యంగా వాటిని ఉపసంహరించేస్తూ కరెన్సీలతో ఆటాడుకుంటున్న సంపన్న దేశాల వైఖరిని ఆయన ఎండగట్టారు. 
 
 గురువారం జీ20 కూటమి సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వర్ధమాన దేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వృద్ధిని పునరుద్ధరించడం ఒకటే మార్గమని, దీనికి అంతా కట్టుబడి ఉన్నామని జీ20 సదస్సు స్పష్టమైన సంకేతాలు పంపాల్సిన అవసరం ఉందని మన్మోహన్ సింగ్ చెప్పారు. వర్ధమాన దేశాలు కోలుకుంటే.. ప్రపంచ రికవరీకి తోడ్పాటు లభిస్తుందన్నారు.మరిన్ని సంస్కరణలు: ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిన భారత్.. ఇకపైనా మరిన్ని చేపడుతుందని ప్రధాని చెప్పారు. అయితే, సబ్సిడీల నియంత్రణ, పన్ను సంస్కరణలు మొదలైనవి కాస్త కష్టతరమైనవిగా ఉండగలవని అన్నారు.
 
 ప్యాకేజీలు ఒక్కసారిగా ఉపసంహరిస్తే కష్టమే: బ్రిక్స్
 అగ్ర దేశాల ద్రవ్య విధానాలు కొంత సత్ఫలితాలిచ్చినప్పటికీ.. ప్రతికూల ప్రభావాలూ చూపుతున్నాయని మన్మోహన్ సింగ్ చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ .. ఉద్దీపన ప్యాకేజీని ఉపసంహరిస్తే ప్రపంచ ఎకానమీపై ప్రతికూల ప్రభావం పడుతుందని అటు బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాధినేతలు కూడా హెచ్చరించారు. ఈ విషయంలో వర్ధమాన దేశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. బ్రిక్ దేశాల ఫండ్‌కు ఓకే:  ఇండియాతో కూడిన ఐదు దేశాల బ్రిక్స్ గ్రూప్ తొలి దశలో భాగంగా 100 బిలియన్ డాలర్ల కరెన్సీ రిజర్వ్ ఫండ్‌ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను ఉపసంహరించినప్పటికీ సమస్యలు ఎదురుకాకుండా ఈ నిధులను వినియోగించుకోవాలని భావిస్తున్నాయి.
 
మరిన్ని వార్తలు