విచ్ఛిన్న శక్తులతో జాగ్రత్త: మన్మోహన్

14 Jan, 2014 02:22 IST|Sakshi
విచ్ఛిన్న శక్తులతో జాగ్రత్త: మన్మోహన్

ప్రజలకు ప్రధాని మన్మోహన్ సూచన
నరేంద్ర మోడీపై పరోక్ష విమర్శలు

 
న్యూఢిల్లీ:
భారతదేశ లౌకికవాదానికి ముప్పుగా పరిణమిస్తున్న విచ్ఛిన్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం నాడిక్కడ జరిగిన వివిధ రాష్ట్రాల మైనార్టీ కమిషన్‌ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో మాటల యుద్ధం తారస్థాయికి చేరినవేళ మన్మోహన్ మరోసారి ఆయనపై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. లౌకికవాదానికి సరికొత్త భాష్యం చెబుతూ భారత లౌకిక విధానానికి గండికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
 
 ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అల్లర్లను ప్రస్తావిస్తూ, దేశంలోని అనేక ప్రాంతాల్లో మెజార్టీ, మైనార్టీ వర్గాల మధ్య సామరస్య సంబంధాలు ఉన్నాయని, అయితే ఇటీవలి కొన్ని ఘటనలతో అవి విషమపరీక్షను ఎదుర్కొంటున్నాయన్నారు. మత, భాష, సంస్కృతిపరమైన భిన్నత్వంలోని ఏకత్వాన్ని దెబ్బతీస్తూ మన సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  సదస్సులో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కె.రెహమాన్ ఖాన్ మాట్లాడుతూ, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ సూచనల మేరకు ఓబీసీలకు కేటాయించిన మొత్తం 27 శాతం రిజర్వేషన్‌లో 15 శాతం ముస్లింలు, క్రైస్తవులకు కేటాయించి 12 శాతాన్ని ఓబీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
 
 దేశావసరాలకు అణు విద్యుత్తే ఆధారం: పీఎం
 గోరఖ్‌పూర్ (హర్యానా): సత్వర ఆర్థికాభివృద్ధి లక్ష్యం సాధించడానికి, పెరుగుతున్న దేశ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అణు విద్యుత్తే ఆధారపడ తగినదని, ఉత్తమ ఎంపికని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. హర్యానాలోని ఫతేహబాద్ జిల్లా గోరఖ్‌పూర్‌లో 2,800 మెగావాట్ల అణు విద్యుత్తు కేంద్రానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఒక్కొక్కటి 700 మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్లను రూ. 23,502 కోట్ల వ్యయంతో హర్యానా అణు విద్యుత్ పరియోజన ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం గోరఖ్‌పూర్‌లో 847 కుటుంబాలకు చెందిన 1,503 ఎకరాల భూమిని సేకరించింది.

మరిన్ని వార్తలు