మన్మోహన్‌కు సమన్లు జారీ చేయాల్సిందే

22 Sep, 2015 02:50 IST|Sakshi
మన్మోహన్‌కు సమన్లు జారీ చేయాల్సిందే

బొగ్గు స్కామ్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో దాసరి పిటిషన్
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపు స్కామ్‌లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. స్కామ్‌కు సంబంధించిన ఓ కేసులో మన్మోహన్‌కు సమన్లు జారీ చేయాలని అదే కేసులో నిందితుడైన కేంద్ర బొగ్గుశాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావు సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.

పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు చెందిన కంపెనీలకు జార్ఖండ్‌లోని అమర్‌కొండా ముర్గాదంగల్ గనిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారన్న కేసులో మన్మోహన్‌ను అదనపు నిందితుడిగా చేర్చి సమన్లు జారీ చేయాలంటూ జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడా వేసిన పిటిషన్‌ను దాసరి సమర్థించారు. అప్పటి బొగ్గు మంత్రి కూడా అయిన మన్మోహన్ రెండు పర్యాయాలు పరిశీలించాకే జిందాల్ సంస్థలకు బొగ్గు క్షేత్రాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.

ఈ మేరకు దాసరి  న్యాయవాది సతీశ్ మనేషిండే.. జడ్జి భరత్ పరాశర్ ఎదుట వాదనలు వినిపించారు. కాగా, కోడా పిటిషన్‌ను తాము సమర్థించట్లేదని అదే సమయంలో దానికి వ్యతిరేకమూ కాదని నవీన్ జిందాల్ న్యాయవాది ఎస్.వి. రాజు చెప్పారు.  అయితే కోడా పిటిషన్‌పై వెలువరించే తీర్పు ఈ కేసులో జిందాల్ డిశ్చార్జ్ పిటిషన్ హక్కు సహా ఇతర హక్కులకు విఘాతం కలిగించేలా ఉండరాదన్నారు.

సహ నిందితుల్లో చాలా మంది ఇదే వాదన వినిపించారు. కాగా, ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి శాశ్వతంగా మినహాయింపు ఇవ్వాలన్న జిందాల్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు కోడా పిటిషన్‌పై మంగళవారం వాదనలు వినిపిస్తానని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.ఎస్. చీమా కోర్టుకు తెలిపారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, గగన్ స్పాంజ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అక్రమంగా గనిని కేటాయించారని ఆరోపిస్తూ దాసరి, మధుకోడా, జిందాల్ సహా 15 మందిని సీబీఐ ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ వేసింది.

అయితే మన్మోహన్‌తోపాటు అప్పటి ఇంధనశాఖ కార్యదర్శి ఆనంద్ స్వరూప్, నాటి గనులు, భూగర్భశాఖ కార్యదర్శి జైశంకర్ తివారీలను ఈ కేసులో అదనపు నిందితులుగా చేర్చాలని మధుకోడా పిటిషన్ వేశారు. దీనిపై అభిప్రాయం తెలపాల్సిందిగా కోర్టు నిందితులకు సూచించింది.

మరిన్ని వార్తలు