మాంచెస్టర్‌ మారణకాండ: భారీ మూల్యం!

23 May, 2017 09:04 IST|Sakshi
మాంచెస్టర్‌ మారణకాండ: భారీ మూల్యం!

మాంచెస్టర్‌: యూకేలోని ప్రఖ్యాత పారిశ్రామిక నగరం మాంచెస్టర్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఇంగ్లాండ్‌లో అతిపెద్ద ఈవెంట్‌ హబ్‌గా పేరుపొందిన మాంచెస్టర్‌ ఎరీనాలో భారీ పేలుడుకు పాల్పడ్డారు. స్టానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:35కు చోటుచేసుకున్న దాడిలో 20 మంది చనిపోగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఎరీనాలో అమెరికన్‌ పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండే షో ముగియగానే.. సీట్లలో నుంచి లేచిన జనం గుంపులు గుంపులుగా ద్వారాల వద్దకు చేరుకున్నారు.. సరిగ్గా అదే సమయంలో ఒక ద్వారం వద్ద భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో భీతిల్లిపోయిన జనం.. పరుగులు తీశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ప్రాణభయంతో చిన్నారులు అరుస్తుండటం వీడియోల్లో రికార్డయింది. మాంచెస్టర్‌ మారణకాండ ముమ్మాటికీ ఉగ్రవాదుల పనేనని ఇంగ్లాండ్‌ పోలీసులు ప్రకటించారు. పేలుడు నేపథ్యంలో యూకే వ్యాప్తంగా అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాంచెస్టర్‌ దాడిని ఖండించారు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు.


ఐసిస్‌ను తక్కువగా అంచనావేశారా?
గడిచిన కొద్ది నెలలుగా సైలెంట్‌గా ఉన్న ఐసిస్‌.. అదనుచూసి పంజా విసిరింది. సిరియా, ఇరాక్‌లోని ఐసిస్‌ ప్రాబల్య ప్రాంతాలపై యూఎస్‌, రష్యా, సిరియా, ఇరాక్‌ సైన్యాలు ఎడతెరిపిలేకుండా జరుపుతున్న దాడులతో కొద్దిగా వెనక్కి తగ్గిన రాక్షసమూక.. మాంచెస్టర్‌ దాడితో మళ్లీ తన ఉనికిని చాటుకుంది. అమెరికాలో దాడులు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో కొన్నేళ్ల కిందటే యూరప్‌ను టార్గెట్‌ చేసిన ఐసిస్‌ భారీ విధ్వంసాలకు కుట్రపన్నింది. ఫ్రాన్స్‌లోని నీస్‌ నగరంలో ట్రక్కుదాడి, బ్రసెల్స్‌లో పేలుళ్లు తమపనేనని గర్వంగా ప్రకటించుకుంది. కొద్ది రోజుల కిందట ఏకంగా యూకే పార్లమెంట్‌ భవనంపైనే దాడికి తెగబడటం, ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.

అయితే, చిన్నచిన్న దాడులు తప్ప భారీ విధ్వంసం చేయలేదని ఐసిస్‌ పట్ల ఇంగ్లాండ్‌ భద్రతా బలగాలు వేసిన అంచనాలు తప్పని భారీ మూల్యం చెల్లించుకున్నాకగానీ తెలిసిరాలేదు. 21వేల మంది ప్రేక్షకులు హాజరైన ఈవెంట్‌లో ఉగ్రవాదులు సులువుగా పేలుళ్లకు పాల్పడటం.. భద్రతా బలగాల పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది. మాంచెస్టర్‌ ఎరీనాలో పేలుడుకు ఉపయోగించిన 'నెయిల్‌ బాంబు'ను ఉగ్రవాదులు ఎలా తీసుకెళ్లారు? చెక్‌ పాయింట్లను ఎలా బురిడీకొట్టించారు? అనే ప్రశ్నలకు జవాబులు తెలిస్తే భద్రతా బలగాల వైఫల్యం బట్టబయలవుతుంది.

 

మరిన్ని వార్తలు