మూడు లక్షల మంది పార్టీకి టాటా!

11 Jul, 2016 10:15 IST|Sakshi
మూడు లక్షల మంది పార్టీకి టాటా!

చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్‌ను అసెంబ్లీ ఎన్నికలు పీకల్లోతు కష్టాల్లో ముంచిన విషయం తెలిసిందే. పార్టీలో చీలిక, జిల్లాల కార్యదర్శులు గుడ్‌బై లేఖాస్త్రాలు, కేడర్‌లో అసంతప్తి జ్వాల వెరసి డీఎండీకే భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇప్పటికే పలువురు నాయకులు గుడ్‌బై చెప్పేయగా, ఉన్న వాళ్లను లాక్కెళ్లేందుకు మక్కల్ డీఎండీకే నేత చంద్రకుమార్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ డీఎండీకే కేడర్‌ను తన వైపునకు తిప్పుకోవడంతో తీవ్రంగానే చంద్రకుమార్ అండ్ బృందం పరుగులు తీస్తున్నది.

డీఎండీకే నుంచి మూడు లక్షల మంది తమతో కలసి డీఎంకేలో చేరబోతున్నట్టు ఆదివారం  చంద్రకుమార్ ప్రకటించడం గమనార్హం. దీంతో విజయకాంత్ వెన్నంటి ఎందరు ఉంటారో అన్న ప్రశ్న బయలు దేరింది. స్థానిక సమరంపై సమాలోచనకు ఆహ్వానిస్తే నేతలు పార్టీ కార్యాలయం వైపుగా తొంగిచూడక పోవడం బట్టి చూస్తే, ఇక, డీఎండీకే భవిష్యత్తు ఏమిటో అన్న ప్రశ్న బయలు దేరింది. స్థానిక బరిలో దిగాలంటే, పార్టీ నిధులు ఇవ్వాల్సిందేనని, తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో లేమంటూ పలువురు నాయకులు కరాఖండీగా విజయకాంత్ ఎదుట స్పష్టం చేశారు.

పార్టీ నిధులు ఇప్పట్లో రాలే పరిస్థితిలేని దష్ట్యా, ట్రస్టు నిధుల వ్యవహారంలో ఆరోపణలు వచ్చి ఉన్న నేపథ్యంలో ఈ సారి స్థానిక సమరం తమకు అవసరమా? అన్న యోచనలో విజయకాంత్ ఉన్నట్టు సమాచారాలు వెలువడుతున్నాయి. నిధులు పంపిణీ చేసినా, ఎన్నికల్లో ప్రస్తుతం తమ ఓటమి తప్పదని, అధికార బలం ముందు అభ్యర్థులు తల వంచాల్సిన పరిస్థితి తప్పదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఉన్నట్టు సమాచారం.

అందుకే ఈ సారి స్థానిక ఎన్నికల్ని బహిష్కరించి, తదుపరి పార్టీ బలోపేతం దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు తగ్గ కార్యాచరణతో విజయకాంత్ ఉన్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. స్థానిక సమరం బహిష్కరణ ప్రకటనను తన జన్మదినం సందర్భంగా విజయకాంత్ చేస్తారని చెబుతున్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు