భార్యలపై అత్యాచారాలను అడ్డుకోండి: కోర్టు

4 Mar, 2014 15:16 IST|Sakshi

వైవాహిక అత్యాచార బాధితులు కూడా అందరిలాంటివాళ్లేనని, వాళ్లను కూడా ఇతర బాధితులతో సమానంగానే చూడాలని ఢిల్లీ కోర్టు తెలిపింది. గర్భిణి అయిన తన భార్యపై అత్యాచారం చేసి కేసులో నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. వైవాహిక అత్యాచార కేసులు నానాటికీ పెరిగిపోతుండటంతో చట్టం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని, భార్య అయినంత మాత్రాన ఎలా పడితే అలా వ్యవహరించడానికి వీల్లేదని కోర్టు తెలిపింది. ఇలాంటి కేసుల్లో బాధితులకు ప్రభుత్వ సాయం కూడా ఏమీ అందడం లేదని గుర్తుచేసింది.

ఢిల్లీలోని కేశవపురం ప్రాంతానికి చెందిన బాధితురాలి సంరక్షణ బాధ్యతలను ఢిల్లీ సర్కారు చేపట్టాలని అదనపు సెషన్స్ జడ్జి కామినీ లావూ ఆదేశించారు. తాను గర్భిణి అయినా.. తన భర్త తాగొచ్చి ప్రతిరోజూ బలవంతం చేస్తున్నాడని బాధితురాలు కేసు పెట్టింది. కేవలం భార్య అయినందుకు అతడు పెట్టే ఆంక్షలను భరించాల్సిన అవసరం ఆమెకు లేదని జడ్జి అన్నారు. అతడి మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, అందువల్ల అతడికి బెయిల్ ఇవ్వకూడదని తెలిపారు. శృంగారం విషయంలో తన ఇష్టం వచ్చినట్లు తొమ్మిదేళ్ల కొడుకుకు చెప్పి, అతడి మనసును కూడా పాడుచేశాడని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు