మార్కెట్ కమిటీ 14 మందికి పరిమితం

30 Oct, 2015 03:28 IST|Sakshi
మార్కెట్ కమిటీ 14 మందికి పరిమితం

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో తొలిసారిగా రిజర్వేషన్ విధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం కమిటీ సభ్యుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించింది. గతంలో కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 18 మంది సభ్యులుండగా.. నూతన మార్గదర్శకాల ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్ సహా 14 మందికి పరిమితం చేశారు. సభ్యుల నియామక ప్రక్రియను 3 కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో రైతులు, రెండో కేటగిరీలో లెసైన్సు కలిగిన వ్యాపారస్తులు, మూడో కేటగిరీలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

మొదటి కేటగిరీకి సంబంధించి సంబంధిత మార్కెట్ కమిటీ పరిధిలోని గ్రామాల నుంచి 8 మంది రైతులను సభ్యులుగా నామినేట్ చేస్తారు. వీరిలో కనీసం ఐదుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ కేటగిరీలకు చెందిన వారై ఉండాలి. సన్న, చిన్నకారు రైతులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తిదారులు, పశుగణ పోషకుల నుంచి 8 మంది సభ్యులను నియమిస్తారు. రెండో కేటగిరీలో సంబంధిత మార్కెట్ కమిటీలో లెసైన్సు పొందిన ఇద్దరు వ్యాపారస్తులను మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ సూచన మేరకు నామినేట్ చేస్తారు.

మూడో కేటగిరీలో నలుగురు సభ్యుల్ని నియమిస్తారు. వీరిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, సహకార మార్కెటింగ్ సంఘాల అధ్యక్షుల కోటా నుంచి ఒకరు చొప్పున ఇద్దరిని నామినేట్ చేస్తారు. మార్కెట్ ఏడీతో పాటు సంబంధిత మార్కెట్ కమిటీ పరిధిలోని వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, పశు సంవర్దక శాఖ, మత్స్యశాఖలకు చెందిన ఏడీలలో ఒకరిని ఎంపిక చేస్తారు. మార్కెట్ కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతంలోని మున్సిపల్ చైర్మన్ లేదా గ్రామ సర్పంచ్ సభ్యుడిగా కమిటీలో ఉంటారు.
 
చైర్మన్ ఎంపిక విధానం
రైతుల కోటాలో నామినేట్ అయిన 8 మంది సభ్యుల్లో ఒకరిని రిజర్వేషన్ రోస్టర్‌కు అనుగుణంగా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తారు. రైతులు లేదా లెసైన్సు కలిగిన వ్యాపారుల కోటాకు చెందిన సభ్యుల్లో ఒకరిని వైస్ చైర్మన్‌గా నియమించే వీలుంటుంది. ఎంపిక చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవీ కాలం ఏడాదిగా నిర్ణయించారు.

రాష్ట్రంలో 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలుండగా, పీసా చట్టం-1996 ప్రకారం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో షెడ్యూలు ఏరియాలోని 11 కమిటీలను ఎస్టీలకు కేటాయించారు. మిగతా 168 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఎస్టీలకు 6, ఎస్సీలకు 15, బీసీలకు 29 శాతం చొప్పున కమిటీ చైర్మన్ పదవులు కేటాయించారు.

మరిన్ని వార్తలు