గణాంకాల ఎఫెక్ట్!

12 Aug, 2013 01:40 IST|Sakshi
గణాంకాల ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, రూపాయి కదలికలు, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ వంటి బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటికితోడు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని తెలిపారు. ఆహార భద్రత బిల్లు తదితర పలు బిల్లులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. కాగా, ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఈ నెల 15న(గురువారం) స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా మార్కెట్లకు సెలవు. తొలుత సోమవారం(12న) జూన్ నెల పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), గణాంకాలు వెలువడనున్నాయి. అదే రోజు వినియోగ ధరల(రిటైల్) ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు కూడా తెలియనున్నాయి. ఇక  బుధవారం(14న) జూలై నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం
 
 (డ బ్ల్యూపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. 
 ఐఐపీ 1% ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకునే అవకాశమున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. రుణ రేట్లు దిగిరాకపోవడంతో పారిశ్రామికోత్పత్తి ప్రగతికి అడ్డుకట్ట పడుతున్నదని చెప్పారు. డ బ్ల్యూపీఐ 5% లోపునకు పరిమితమైతే, వడ్డీ రేట్లను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంకుకు వీలు చిక్కుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ విశ్లేషించింది.  వరుసలో బ్లూచిప్స్: తొలి క్వార్టర్  ఫలితాలను సోమ వారం ఎస్‌బీఐ ప్రకటించనుంది. ఈ బాటలో ఇతర దిగ్గజాలు టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, హిందాల్కో, డీఎల్‌ఎఫ్ సైతం క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎస్‌బీఐ ఫలితాలు రానున్న కొద్ది రోజులపాటు బ్యాంకింగ్ రంగ షేర్లపై ప్రభావాన్ని చూపనున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. ఇటీవలి ట్రెండ్‌నుబట్టి మార్కెట్లు సాంకేతికంగా పుంజుకుంటే అమ్మకాలు పెరుగుతాయన్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 5,750కుపైన నిలవగలిగితేనే కొనుగోళ్లకు అవకాశముంటుందని చెప్పారు. వెరసి దిగువముఖంగా 5,450 స్థాయిని నిఫ్టీ చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు.  
 
 అంతర్జాతీయ అంశాలు కూడా
 బ్లూచిప్ కంపెనీల ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలకు తోడు అంతర్జాతీయ అంశాలు కూడా మార్కెట్ల ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్  గోయల్ చెప్పారు. కాగా, డాలరుతో మారకంలో రూపాయి విలువ గత వారం చరిత్రాత్మక కనిష్ట స్థాయి 61.80ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి విలువ దాదాపు 13% పతనంకాగా, స్టాక్ మార్కెట్లు సైతం ఇటీవల బలహీనపడుతూ వచ్చాయి. ఈ ప్రభావంతో రిజర్వ్ బ్యాంకు రూపాయి విలువను నిలబెట్టేందుకే విధానపరమైన చర్యలను పరిమితం చేసింది. ఇకపై ప్రభుత్వం రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయగల చర్యలను చేపడుతుందని విశ్వసిస్తున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ నిపుణులు దీపేన్ షా చెప్పారు. 
 
>
మరిన్ని వార్తలు