మారుతీ లాభం మూడింతలు

29 Oct, 2013 00:59 IST|Sakshi

 న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ లాభం దాదాపు మూడింతలు ఎగబాకింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో కంపెనీ నికర లాభం రూ.670 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.227 కోట్లు మాత్రమే.  ఈ క్యూ2లో కంపెనీ లాభం దూసుకెళ్లడానికి గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాల పెంపునకు చేపట్టిన ప్రయత్నాలు, వ్యయ ఆదా చర్యలు, రూపాయి మారకం విలువ భారీ క్షీణత వంటివి ప్రధాన కారణాలుగా నిలిచాయని మారుతీ సుజుకీ సీఈఓ, ఎండీ కెనిచి అయుకవా పేర్కొన్నారు. కాగా, కంపెనీ మొత్తం ఆదాయం క్యూ2లో రూ.10,212 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.8,070 కోట్లతో పోలిస్తే 26 % వృద్ధి నమోదైంది. ఇక జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో కంపెనీ అమ్మకాల సంఖ్య 19.6 శాతం పెరిగింది. మొత్తం 2,75,586గా నమోదైంది.
 

మరిన్ని వార్తలు