భారీగా పెరగనున్న మారుతీ, హ్యుందాయ్ ధరలు!

31 Dec, 2016 09:15 IST|Sakshi
భారీగా పెరగనున్న మారుతీ, హ్యుందాయ్ ధరలు!
ముంబై : దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్లు కార్ల ధరలను భారీగా పెంచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. జనవరిలో ఈ వాహన సంస్థలు కార్ల ధరలను రూ. 2500 నుంచి లక్ష రూపాయల వరకు పెంచనున్నట్టు తెలుస్తోంది. ముడిసరుకుల ధరలు భారీగా పెరగడం, గత కొన్ని నెలలుగా వరుసగా డిస్కౌంట్లు ఆఫర్ చేయడం, రూపాయి విలువ పతనమవడం వంటివి కార్ల ధరలు పెంపుకు దోహదం చేస్తున్నాయి. రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి చేసుకునే కార్ల విడిభాగాల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో జనవరిలో తమ వాహన ధరలను పెంచాలని కార్ల తయారీ సంస్థలు యోచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కార్ల సంస్థలు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించేశాయి. మిగతా సంస్థలు కూడా ధరల పెంపు ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
న్యూఇయర్ ప్రారంభంలో మారుతీ సుజుకీ ధరలు పెంచడానికి ఎప్పుడూ మొగ్గుచూపదు. కమోడిటీ నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకే సిద్దమై ఉంటుంది. కానీ భారీ డిస్కౌంట్లు, రూపాయి పతనం వంటివి ఈ సంస్థ రెవెన్యూలకు గండికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి కార్ల ధరలను పెంచనున్నామని మారుతీ సుజుకీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సీ చెప్పారు. అయితే ధరలు ఎంతపెంచాలనే దానిపై తమ ధరల నిర్ణయ టీమ్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఆరు నెలల కాలంలో రెండో సారి మారుతీ కార్ల ధరలను పెంచుతోంది. హ్యుందాయ్ సైతం జనవరిలో తన కార్ల ధరలను పెంచనున్నట్టు తెలిసింది. తమ మోడల్స్పై రూ.4000 నుంచి రూ.1 లక్ష వరకు ధరలు పెంచేందుకు యోచిస్తున్నామని హ్యుందాయ్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాస్తవ చెప్పారు. హ్యుందాయ్ ప్రీమియం ఎస్యూవీ, సాంటా ఫీలపై లక్ష రూపాయల ధర పెరగనుంది.  
 
మరిన్ని వార్తలు