ఒక కోతి ఆలోచించింది.. ఇంకో కోతి ఆచరించింది..!

21 Feb, 2014 05:05 IST|Sakshi
ఒక కోతి ఆలోచించింది.. ఇంకో కోతి ఆచరించింది..!

సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా ‘అవతార్’ చూశారా? అందులో హైబ్రిడ్ మనుషులను సృష్టించి అవతార్‌లుగా మార్చడం.. వారి మెదడుని జన్యుపరంగా దగ్గరి సంబంధం ఉండే వ్యక్తి ఆలోచనల ద్వారా నియంత్రించడం.. అద్భుతంగా ఉంటుంది కదూ! అయితే ఇంతదాకా కల్పితమే అయిన ఈ అద్భుతం భవిష్యత్తులో నిజం కాబోతోంది. అవతార్ సినిమా స్ఫూర్తితో పరిశోధన చేపట్టిన హార్వార్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఒక కోతి మెదడులోని స్పందనలను ఇంకో కోతికి అనుసంధానం చేసి ఆ కోతిలో 98 శాతం కచ్చితత్వంతో కదలికలు తీసుకువచ్చారు. దీంతో భవిష్యత్తులో పూర్తిస్థాయి శరీరాన్నీ కదిలించవచ్చని, క్రమంగా ఈ టెక్నాలజీని మనుషులకూ ఉపయోగపడేలా అభివృద్ధిపర్చి పక్షవాతం రోగులను పరుగెత్తించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
 
ఇంతకూ ఎలా చేశారంటే.. తొలుత ఓ కోతిని మాస్టర్ మంకీగా ఎన్నుకుని దాని మెదడులో 100 నాడీకణాల చర్యలను చదివే ఓ ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చారు. తర్వాత ఆ కోతితో కంప్యూటర్‌పై కర్సర్‌ను కదపడం, జాయ్‌స్టిక్‌ను కదిలించడం వంటివి చేయించారు. మరో కోతిని అవతార్ గా ఎన్నుకుని దాని వెన్నులో 36 ఎలక్ట్రోడ్లను అమర్చారు. తర్వాత మాస్టర్ కోతిలో కదలికల కోసం మెదడు నుంచి వెలువడే విద్యుత్ సంకేతాలను.. అవతార్ కోతి నాడీవ్యవస్థలోకీ ఎలక్ట్రోడ్ల ద్వారా ప్రవేశపెట్టి నాడీవ్యవస్థను ప్రేరేపించారు. దీంతో మాస్టర్ కోతి చేయిని ఎలా కదిలించిందో... అవతార్ కోతి కూడా అచ్చం అలాగే చేయిని కదిలించిందన్నమాట.

మరిన్ని వార్తలు