పారాణి ఆరకముందే ప్రాణాలు తీసుకుంది

17 Mar, 2016 04:41 IST|Sakshi
పారాణి ఆరకముందే ప్రాణాలు తీసుకుంది

- పెళ్లైన 17 రోజులకే ఉరేసుకుని మెడికో ఆత్మహత్య
- కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో చదువుతున్న సౌమ్య
- తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్
- గతనెల 27నే డాక్టర్‌తో వివాహం
- పెళ్లయ్యాక కాలేజీ హాస్టల్‌కు వచ్చిన రోజే బలవన్మరణం
- కూతురి అంత్యక్రియలు నిర్వహించిన కన్నతల్లి

 
సాక్షి, ఖమ్మం క్రైం/కరీంనగర్ రూరల్:
ఒక్కగానొక్క కూతురు. మెడిసిన్ చదువుతోంది. వైద్యుడైన కుర్రాడితో పెళ్లి జరిపించారు తల్లిదండ్రులు. వివాహం జరిగి సరిగ్గా 17 రోజులు! ఏమైందోగానీ కాళ్ల పారాణైనా ఆరకముందే తన నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడేనికి చెందిన మెడికో సూదమళ్ల సౌమ్య కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది.

భోజనానికి పిలిచినా వెళ్లకుండా..
మామిళ్లగూడేనికి చెందిన డాక్టర్ కొమరయ్య, మాలతి దంపతుల ఏకైక కుమార్తె సౌమ్య(25) ఖమ్మంలో ఇంటర్మీడియట్(బైపీసీ) పూర్తి చేసింది. మెడిసిన్ సీటు రావటంతో విజయవాడలోని సిద్ధార్థ మెడికల్  కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. సౌమ్యకు గతనెల 27న నల్లగొండ జిల్లా మోతెకు చెందిన డాక్టర్ పవన్‌కుమార్‌తో వివాహమైంది. సౌమ్యను తీసుకుని మంగళవారం కళాశాలకు వచ్చిన పవన్ ఆమెను హాస్టల్‌లో వదిలిపెట్టి వె ళ్లాడు. మంగళవారం రాత్రి 9 గంటలకు స్నేహితురాలు భోజనానికి పిలిచినా సౌమ్య వెళ్లకుండా భర్తతో సెల్‌ఫోన్‌లో మాట్లాడింది. స్నేహితురాలు తిరిగి గదిలోకి వచ్చేసరికే సౌమ్య ఉరేసుకుని కనిపించింది.

సమాచారం అందుకున్న కరీంనగర్ డీఎస్పీ రామారావు, రూరల్ సీఐ కృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ సౌమ్య రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సౌమ్య మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

కట్నం వేధింపులే కారణమా?
సౌమ్య ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆత్మహత్యకు ముందు సౌమ్య రెండు గంటలపాటు భర్తతో మాట్లాడినట్లు సెల్‌ఫోన్ కాల్‌డేటా ద్వారా తెలుస్తోంది. సౌమ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఏవో బలమైన కారణాలుంటాయని ఆమె స్నేహితులు అభిప్రాయపడుతున్నారు. సౌమ్య సమీప బంధువు సందీప్ మాత్రం ఆత్మహత్యకు అత్తింటివారి కట్న వేధింపులే కారణమని ఆరోపించాడు. రూ.16 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశామని, పెళ్లిరోజున ఆడబిడ్డ కట్నం రూ.10 లక్షలు కావాలని గొడవ చేసి అలిగి అత్తింటివాళ్లు వెళ్లిపోయారని చెప్పాడు. భర్తతో కలిసి హాస్టల్‌కు వచ్చిన రోజునే ఆత్యహత్య చేసుకోవడానికి అత్తింటి వేధింపులే కారణమని ఆరోపించాడు.

ఆ ఇంట ఏడాది నుంచి విషాదాలే...
గతేడాది కొమరయ్య కొడుకు ప్రియతమ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ షాక్ నుంచి కోలుకోకముందే సౌమ్య ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అటు కొడుకు.. ఇటు కూతురు అర్ధంతరంగా తనువు చాలించడంతో ‘మాకెవరు దిక్కు.. మేమెందుకు బతకాలి..’ అంటూ ఆ దంపతులు విలపించడం అందరినీ కలచివేసింది. తండ్రి అనారోగ్యంతో బాధ పడుతుండటంతో తల్లి మాలతి కూతురుకు అంత్యక్రియలు నిర్వహించింది.


సౌమ్య, పవన్‌కుమార్‌రెడ్డిల పెళ్లినాటి ఫొటో (ఫైల్)

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు