మేడిగడ్డ.. మేడి పండేనా?

23 Sep, 2015 03:10 IST|Sakshi
మేడిగడ్డ.. మేడి పండేనా?

* కాళేశ్వరం దిగువ నుంచి నీటి మళ్లింపు ఆర్థిక భారమంటున్న నిపుణులు
* ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్లంపల్లి వరకు ఖర్చు రూ. 14 వేల కోట్లు
* విద్యుత్ అవసరాలు 270 మెగావాట్ల నుంచి 540 మెగావాట్లకు పెరగొచ్చు
* ప్రత్యామ్నాయ డిజైన్లలో ఖర్చు రూ. 7 వేల కోట్ల నుంచి రూ. 9 వేల కోట్లే
* ప్రభుత్వానికి 2 ప్రత్యామ్నాయాలు సూచించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 16 లక్షల ఎకరాల సాగు అవసరాలను పరిగణనలోకి తీసుకొని చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల పథకంపై మళ్లీ ప్రతిష్టంభన మొదలైంది. ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్లుగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ పర్యావరణపరంగా, ఆర్థికంగా, నిర్వహణపరంగా ఏమాత్రం మంచిది కాదని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తేల్చిచెబుతుండటం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. ప్రభుత్వం చెబుతున్న వాదనకు, వాస్తవాలకు మధ్య పెద్ద తేడాలను చూపిస్తూ మేడిగడ్డ ప్రతిపాదన మేడిపండులాంటిదేనని, దానికి ప్రత్యామ్నాయంగా చూపుతున్న రెండు ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వంపై పడే భారాన్ని, ఎదురయ్యే అడ్డంకులను     అధిగమించవచ్చని చెబుతోంది. ప్రభుత్వ దూరదృష్టి, అవగాహన లోపాల కారణంగా ఈ ప్రాజెక్టు అభాసుపాలు కాకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలన్న వాదన వినిపిస్తోంది. ప్రాజెక్టు అంశం రాజకీయ రంగు పులుముకుంటున్న వేళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ చూపిన ప్రత్యామ్నాయాలు తెరపైకి రావడంతో వాటిని ప్రభుత్వం ఎంతమేర పరిగణనలోకి తీసుకుంటుందనే అంశం చర్చనీయంగా మారింది.
 
 మేడిగడ్డ ప్రతిపాదనకు ఎన్నో అడ్డంకులు
 తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తెచ్చి దానిపై సర్వే చేయిస్తుండటం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ నుంచి 160 టీఎంసీల నీటిని మళ్లించి 115 కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్లంపల్లికి తరలించేందుకు 80 మీటర్ల లిఫ్టు అవసరం. దీనికి 540 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా, పంప్‌హౌజ్‌ల నిర్మాణం, కాల్వల తవ్వకానికి మొత్తంగా రూ. 10 వేల కోట్ల ఖర్చు కానుంది. దీంతోపాటే తుమ్మిడిహెట్టి నుంచి ఆదిలాబాద్ జిల్లా సాగు అవసరాలకు నీరివ్వాలంటే అదనంగా మరో రూ. 4 వేల కోట్లు ఖర్చు చేయాలి. మొత్తంగా ప్రాజెక్టుకు రూ. 14 వేల కోట్లు ఖర్చు కానుంది. అయితే ఈ ప్రతిపాదనలో 500 మీటర్ల వెడల్పుతో కాల్వల నిర్మాణం చేస్తే కాల్వ మహదేవ్‌పూర్ కోల్ మైన్స్ గుండా వెళ్లడంతోపాటు తాడిచెర్ల మైన్స్‌కు అడ్డంకిగా మారుతుంది. మంథని, కమాన్‌పూర్, రామగుండం మండలాల్లో ఇప్పటికే ఓపెన్‌కాస్ట్ మైనింగ్ కారణంగా తరలించిన గ్రామాలకు ఇది ఇబ్బందికరం. మేడిగడ్డ లోయర్ గోదావరి బేసిన్‌లో జీ-10లో ఉన్న కారణంగా నీటి వినియోగంపై తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య అంతరాష్ట్ర ఒప్పందాలు తప్పనిసరి అవుతాయి.
 
 మొదటి ప్రతిపాదన..: మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లే 148 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి నుంచి నీటిని తీసుకోవడం. 2009లో సీడబ్ల్యూ సీ లెక్కల మేరకు అక్కడ 236.50 టీఎంసీల నీటి లభ్యత ఉంది. దాంట్లో 160 టీఎంసీల నీటిని మళ్లించేందుకు తుమ్మిడిహెట్టి వద్ద 10 మీటర్ల ఎత్తులో లిఫ్టు ఏర్పాటు చేసి నీటిని తరలించవచ్చు. దీనికి 68 మెగావాట్ల విద్యుత్ అవసరం. 85 కిలోమీటర్ల అనంతరం ప్రధాన కెనాల్‌పై 30 మీటర్ల ఎత్తులో లిఫ్టును ఏర్పాటు చేసి ఎల్లంపల్లికి నీటిని తరలించాలి. దీనికి మరో 202 మెగావాట్ల విద్యుత్ అవసరం. 270 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా దీనికి రూ. 500 కోట్లు ఖర్చవుతుంది. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు ఇతర పనుల ఖర్చు రూ. 6,500 కోట్లు కానుండగా మొత్తంగా రూ.7 వేల కోట్ల మేర ఖర్చవుతుంది. ప్రభుత్వ ప్రతిపాదనతో అయ్యే వ్యయంతో పోలిస్తే రూ. 7 వేల కోట్ల భారం తగ్గుతుంది.
 
 విద్యుత్ వినియోగం తగ్గడంతో ఏటా రూ. 292 కోట్ల మేర మిగులు సాధ్యవుతుంది.
 రెండో ప్రతిపాదన..: ప్రభుత్వం చెబుతున్న మేరకు సీడబ్ల్యూసీ 2015లో రాసిన లేఖలో తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యతే తేల్చిందని అంటున్నారు. సీడబ్ల్యూసీ లెక్కల మేరకు 75 శాతం డిపెండబులిటీ లెక్కన 120 టీఎంసీల నీటిని అక్కడి నుంచి తీసుకొని వేమనిపల్లి మండలం, వెంచెపల్లి గ్రామం వద్ద నుంచి మరో 40 టీఎంసీల నీరు తీసుకునేలా రెండో ప్రతిపాదన తయారు చేశారు. ఇలా నీటిని తీసుకోవాలంటే మూడు చోట్ల లిఫ్టుల నిర్మాణానికి 300 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉండగా మొత్తంగా రూ. 9 వేల కోట్ల మేర ఖర్చయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రతిపాదనలోని మొత్తం లెక్కతో పోలిస్తే ఈ ప్రతిపాదనతోనూ రూ. 5 వేల కోట్ల మేర ఖర్చు తగ్గుతుంది. విద్యుత్ అవసరాలు 240 మెగావాట్ల మేర తగ్గుతుండటంతో ఏటా పడే భారం రూ. 260 కోట్ల మేర ప్రభుత్వంపై తగ్గుతుంది.
 

మరిన్ని వార్తలు