ఈ ఆటోవాలా గొప్పతనమెంటో తెలుసా?

29 Aug, 2016 17:30 IST|Sakshi
ఈ ఆటోవాలా గొప్పతనమెంటో తెలుసా?

సూపర్‌ హీరోలు ఎక్కడో ఉండరు. సినిమాల్లో కనిపించినట్టు చిత్రవిచిత్రమైన దుస్తులు వేసుకొని విన్యాసాలు చేయరు. నిజమైన సూపర్‌ హీరోలు సామాన్య ప్రజల్లోనే ఉంటారు. అలాంటి ఒక సూపర్ హీరో ఆటోవాలా రూపంలో ముంబై వాసి అయిన రమీజ్‌ షైఖ్‌కు ఎదురయ్యాడు. అతని హృదయాన్ని గెలుచుకున్నాడు.

మత సామరస్యం, మానవత్వంతో హృదయాన్ని పరిమళింపజేసిన ఆ అనుభవం గురించి రమీజ్‌ షైఖ్‌ ఈ నెల 26న ఫేస్‌బుక్‌లో వివరించాడు. ఈ ఘటన నెటిజన్లను కదిలించింది. వారితో జేజేలు కొట్టించింది. ఏకంగా ఎనిమిదివేల మందికిపైగా ఈ పోస్టును షేర్‌ చేసుకున్నారు.

ఇంతకు ఆ రోజు ఏం జరిగిందంటే.. రమీష్‌ షేఖ్‌ మాటల్లోనే..
శుక్రవారం కావడంతో నమాజ్‌ కు హాజరయ్యేందుకు మధ్యాహ్నం 1.40 గంటలకు నేను హడావిడిగా ఆఫీసు నుంచి పరిగెత్తుకొచ్చాను. ఆటోలో ఎక్కిన తర్వాత తెలిసింది హడావిడిలో నేను నా పర్సును ఆఫీసులోనే మరిచిపోయిన విషయం. దీంతో నన్ను మసీదు వద్ద డ్రాప్‌ చేసి 10-15 నిమిషాలు ఆగమని, ఆ తర్వాత తిరిగి ఆఫీసు దగ్గర దిగబెడితే.. మీటర్‌ చార్జీ కన్నా ఎక్కువే ఇస్తానని ఆటో డ్రైవర్‌కు చెప్పాను.

అతని ఆటో ముందు అద్దంపై గణపతి ఉత్సవ స్టిక్కర్‌ అంటించి ఉంది. అతను మాత్రం 'భగవంతుని పనిమీద వెళుతున్నారు. మీరు టెన్షన్‌ పడకండి. నేను మిమ్మల్ని తీసుకెళుతాను. కానీ మీరు వచ్చేవరకు నేను ఆగలేను. నాకు వెళ్లాల్సిన పని ఉంది' అని చెప్పాడు. అందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పాను. ఆయన ఒప్పుకోకపోయి ఉంటే నేను ప్రార్థనను మిస్ అయ్యేవాడిని.

మసీదు వద్ద నన్ను దింపేసిన తర్వాత ఆయన నా జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేనివిధంగా మానవత్వాన్ని చూపారు. తన జేబులోంచి డబ్బులు తీసి నా చేతిలో పెట్టారు. నమాజ్‌ ముగిసిన తర్వాత ఈ డబ్బుతో తిరిగి ఆఫీసుకు వెళ్లమని చెప్పారు. నా కోసం ఆయన వేచి ఉండలేరు కాబట్టి నేను ఏ ఇబ్బంది పడకుండా తిరిగి ఆఫీసుకు వెళ్లేందుకు సైతం ఆయన ఆలోచించారు. అందుకు డబ్బులు ఇచ్చారు. ఇలా జరిగినందుకు ఏం చికాకుపడకు అని కూడా ఆయన నాకు చెప్పారు. దీంతో ఆయనకు ఏవిధంగా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియలేదు.

ఆయనే శుక్లాజీ. (ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి). ఒక ఆటోవాలా. గణపతి భక్తుడు. నుదుటన పెద్ద తిలకం ధరించిన ఆయన చాలామంది కళ్లు తెరిపించారు. తన విశ్వాసం కాకపోయినప్పటికీ సహచర మానవుడు తన ఇష్టదైవాన్ని ఏ అసౌకర్యంలేకుండా ప్రార్థించుకోవడానికి వీలుగా ఆయన ఎంతగానో సహాయపడ్డారు.