ఆడికారు ధర కంటే ఈ గుర్రమే ఎక్కువ

8 Nov, 2016 14:02 IST|Sakshi
ఆడికారు ధర కంటే ఈ గుర్రమే ఎక్కువ

బైకులు, కార్లు, విమానాలు వచ్చాక నేటి ఆధునిక సాంకేతికయుగంలో గుర్రాల వాడకం క్రమంగా తగ్గిపోయి ఉండొచ్చు కానీ హరియాణలోని ఓ స్వచ్ఛమైన మేలి జాతి గుర్రం ‘సుల్తాన్’ ఆడి కారు కంటే అధిక ధర పలికింది. ఈ గుర్రం కోసం కొందరు ఏకంగా 51 లక్షల రూపాయలు ఇస్తామని యజమాని గుర్వీందర్ సింగ్కు ఆఫర్ చేశారు. సుల్తాన్ను సొంత కొడుకులా భావించే యజమాని ఈ ఆఫర్ను తిరస్కరించాడు. 41 లక్షల రూపాయలు పెడితే ఆడి ఏ 4 కారు వస్తుంది. అయితే ఆడి కారు కంటే గుర్రమే తనకు ప్రాణమని గుర్వీందర్ చెబుతున్నాడు.

హరియాణాలోని కర్నల్ జిల్లాలో డబ్రీ అనే గ్రామంలో నుక్రా జాతికి చెందిన ఈ తెల్లటి గుర్రం అందర్నీ ఆకర్షిస్తోంది. పానిపట్లో జరిగిన ఆల్ ఇండియా చాంపియన్ పోటీల్లో ఈ గుర్రం విజేతగా నిలిచింది. 2012లో కూడా జాతీయ చాంపియన్గా నిలిచింది. కర్నల్ జిల్లా సహా ఎక్కడ గుర‍్రపు పందేలు జరిగినా సుల్తాన్దే విజయం. 15 చాంపియన్‌షిప్స్లో విజేతగా నిలిచింది. సుల్తాన్ చూసి డబ్రీ గ్రామస్తులు గర్వంగా భావిస్తున్నారు.

ఈ గుర్రం సంరక్షణ బాధ్యతలు చూడటానికి గుర్వీందర్ ఓ వ్యక్తిని నియమించాడు.ఈ గుర్రం కోసం ప్రతి నెలా లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. సుల్తాన్ సాధారణ ఆహారంతో పాటు రోజుకు ఐదు లీటర్ల ఆవు పాలు, 100 గ్రాముల నెయి తీసుకుంటుంది. అంతర్జాతీయ పోటీల్లో సుల్తాన్ పాల్గొనేందుకు గుర్వీందర్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు