భర్త మానసిక వైకల్యం విడాకులకు దారికాదు:బాంబే హైకోర్టు

25 Jan, 2014 22:58 IST|Sakshi

ముంబై: భర్తకు మానసిక వైకల్యం ఉన్నంత మాత్రాన భార్యకు విడాకులు మంజూరు చేయడం కుదరదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భర్తకు మానసిక వైకల్యం ఉన్నా.. అది ఆమె అతడితో కలిసి జీవించడానికి వీల్లేకుండా ఉన్నట్లు కూడా రుజువు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తన భర్త స్కీజోఫ్రీనియా బాధితుడని, వివాహం తర్వాత తనను పలుసార్లు కొట్టాడని.. కనుక విడాకులు మంజూరు చేయాలని కోరుతూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వీఎల్ అచ్లియా, జస్టిస్ విజయ తహిల్మ్రణితో కూడిన ధర్మాసనం విచారణ అనంతరం కొట్టివేసింది.

 

భర్త కనీసం తన పనులను కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నాడనేందుకు తగిన ఆధారాలను ఈ కేసులో పిటిషనర్ పేర్కొనలేకపోయారని ధర్మాసనం పేర్కొంది. తొలుత ముంబైలోని కుటుంబ వివాదాల పరిష్కార కోర్టు విడాకుల మంజూరుకు తిరస్కరించగా.. ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
 

మరిన్ని వార్తలు