షిర్డీ సమీపంలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

6 Sep, 2013 15:52 IST|Sakshi

సాయినాథుడు నడయాడిన ప్రాంతమది. అందరూ చల్లగా ఉండాలని, పదిమందికీ మేలు జరగాలని చెప్పిన సాయి సంచరించిన ప్రాంతంలోనే ఘోరం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళపై నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్గావ్ తాలూకాలోని జేవూర్ పటోడా గ్రామానికి చెందిన బాధితురాలు తన సోదరితో కలిసి ఉంటుంది.

గురువారం ఉదయం ఆమె తన ఇంటి నుంచి బయటకు వెళ్లగానే నిందితులు బలవంతంగా ఆమెను కొంతదూరం తీసుకెళ్లి, అక్కడ సమీపంలో ఉన్న పొలాల్లో ఆమెపై అత్యాచారం చేసి, అక్కడినుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఏం జరిగిందన్న విషయాన్ని పూర్తిగా చెప్పే పరిస్థితిలో కూడా లేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద గుర్తు తెలియని నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలో కొన్ని పగిలిన గాజులు, మట్టి సేకరించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం అహ్మద్నగర్ సివిల్ ఆస్పత్రిలో చేర్చారు.

>
మరిన్ని వార్తలు