చైనా చాలా పెద్ద తప్పు చేసింది!

6 Sep, 2017 09:13 IST|Sakshi
చైనా చాలా పెద్ద తప్పు చేసింది!

జియామెన్‌: బ్రిక్స్‌ వార్షిక సదస్సు సందర్భంగా చేసిన జియామెన్‌ డిక్లరేషన్‌లో పాకిస్థాన్‌, ఆఫ్గనిస్థాన్‌ దేశాలకు చెందిన ఉగ్రవాద గ్రూపుల పేర్లు చేర్చడం చైనా చేసిన పెద్ద పొరపాటు అని ఆ దేశ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య వల్ల చైనాతో ఆయా దేశాలకు ఉన్న సంబంధాలు తీవ్రంగా దెబ్బతినవచ్చునని అంటున్నారు. ఆర్థిక వేదిక అయిన 'బ్రిక్స్‌' అజెండాను ఇది హైజాక్‌ చేయడమేనని విరుచుకుపడుతున్నారు.

ఐదు బ్రిక్స్‌ దేశాల ఆమోదంతో వెలువడిన జియామెన్‌ డిక్లరేషన్‌లో 'తాలిబాన్, ఐఎస్ఐఎల్ /డాషే, అల్‌కాయిదా, దాని అనుబంధ సంస్థలైన తూర్పు టర్కిస్థాన్‌ ఇస్లామిక్ మూవ్మెంట్, ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, హక్కాని నెట్‌వర్క్, లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్, టీటీపీ, హిజ్బ్ ఉట్‌-తహిర్ర్' తదితర ఉగ్రవాద గ్రూపుల పేర్లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అన్ని ఉగ్రవాద దాడులను ఖండిస్తామని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దానిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోమని డిక్లరేషన్‌ స్పష్టం చేసింది.

అయితే, ఈ డిక్లరేషన్‌లో సెలెక్టివ్‌ ఉగ్రవాద గ్రూపుల పేర్లను మాత్రమే ప్రస్తావించారంటూ చైనా విదేశాంగ నిపుణులు తప్పుబడుతున్నారు. '1960 తర్వాత చైనా-పాకిస్థాన్‌ సంబంధాలు అతిపెద్ద సవాలును ఎదుర్కోబోతున్నాయి. దీనివల్ల చాలా తీవ్రమైన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది నిజంగా చాలా పెద్ద తప్పు. చైనా ప్రభుత్వం రాబోవుకాలంలో ఈ విషయాన్ని తెలుసుకుంటుంది' అని చైనా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాంటెంపరరీ ఇంటర్నేషనల్‌ రిలేషన్‌లో దక్షిణ, ఆగ్రేయాసియా, ఒషినియా వ్యవహారాలు చూసే హు షిషెంగ్‌ పేర్కొన్నారు. 'ఈ డిక్లరేషన్‌ ద్వారా భారత్‌ విజయం సాధించింది. తను కోరుకున్నది.. కావాలనుకున్నది సాధించుకోగలిగింది. చైనా ఇందుకు అనుమతించి ఉండాల్సింది కాదు' అని మరో నిపుణుడు పేర్కొన్నారు.

ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం కల్పిస్తోందని భారత్‌ ఆరోపిస్తున్నా.. చైనా గుడ్డిగా దాయాదిని వెనకేసుకొస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడికి సూత్రధారి అయిన జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌పై ఐరాసలో తీర్మానాన్ని చైనా మొండిగా అడ్డుకుంటోంది. బ్రిక్స్ డిక్లరేషన్‌లో జైషే మొహమ్మద్‌ పేరును ప్రస్తావించినప్పటికీ.. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్‌ తీర్మానాన్ని చైనా ఆమోదించే అవకాశం లేదని అంటున్నారు.

మరిన్ని వార్తలు