రాహుల్‌పై స్మృతి ఇరానీ వ్యంగ్యాస్త్రాలు

16 Sep, 2017 17:54 IST|Sakshi
రాహుల్‌పై స్మృతి ఇరానీ వ్యంగ్యాస్త్రాలు

సాక్షి, న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి.. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు నవభారత నిర్మాణానికి కృషి చేస్తోందని, ఈ నవభారతంలో వారసత్వం కన్నా ప్రతిభకే పెద్దపీట వేస్తామని, ప్రతిభా ఆధారంగానే ప్రతి ఒక్కరికీ అవకాశాలు లభిస్తాయని అన్నారు. 'ఇండియా టుడే మైండ్‌ రాక్స్‌-2017' కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

'ఢిల్లీలో తమ కుటుంబాల కోసం కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ ఓ బెరుకు ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి 'మా నాన్న ఎవరో మీకు తెలుసు కదా' అని అడుగుతారని.. ప్రతిభ ఆధారంగా కాకుండా వారసత్వం ఆధారంగా అవకాశాలు తన్నుకుపోతారని భయం ఉంటుంది. కానీ, మోదీ నవభారతంలో ఇలా చెప్తే కుదరదు' అని స్మృతి ఇరానీ తెలిపారు. 'కలలు కనే సాహసం, ప్రతిభా ఆధారంగా వాటిని సాధించుకొనే తెగువ ఉన్నవారిదే ఈ నవభారతం' అని ఆమె వివరించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఇష్టమున్న యువత ఎవరైనా ఈ రంగాన్ని ఎంచుకోవచ్చా? లేక రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవారే రావాలా? అన్న వ్యాఖ్యాత ప్రశ్నకు ఆమె ఈ విధంగా బదులిచ్చారు.

మరిన్ని వార్తలు