ఒకే బ్రాండ్‌గా ‘మహా’ సిమెంట్

8 Nov, 2016 01:41 IST|Sakshi
ఒకే బ్రాండ్‌గా ‘మహా’ సిమెంట్

వచ్చే జనవరికల్లా
 తమిళనాడు ప్లాంటు రెడీ
 ఉత్పత్తి 10 మిలియన్ టన్నులకు
 ఫార్మా రంగంలోకి మై హోమ్
 

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీలో ఉన్న మై హోమ్ ఇండస్ట్రీస్ రీబ్రాండింగ్ చేపట్టింది. మహా సిమెంట్, మహా శక్తి, మహా గోల్డ్ బ్రాండ్ల స్థానంలో ఇక నుంచి ‘మహా’ పేరుతో సిమెంటును విక్రయించనుంది. దక్షిణాదిన సుస్థిర వాటాతో ఇప్పటికే 12 రాష్ట్రాల్లో అడుగు పెట్టినట్టు కంపెనీ ఈడీ ఎస్.సాంబశివరావు ఈ సందర్భంగా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో రీబ్రాండింగ్ చేపట్టినట్టు చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 మందికిపైగా కంపెనీ ద్వారా ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. నల్గొండ, కర్నూలు, వైజాగ్‌లలో ఉన్న కంపెనీ ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 8.4 మిలియన్ టన్నులు. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద రూ.250 కోట్లతో నెలకొల్పుతున్న ప్లాంటు జనవరికల్లా సిద్ధమవుతోంది. ఈ ప్లాంటు తోడైతే కంపెనీ సామర్థ్యం 10 మిలియన్ టన్నులకు చేరనుంది.
 
 ఇదీ గ్రూప్ ప్రణాళిక..: ప్లాంట్ల వినియోగం ప్రస్తుతం 50% ఉన్నట్లు మై హోమ్ ఇండస్ట్రీస్ తెలిపింది. వినియోగం పూర్తి స్థారుుకి చేరుకున్నాక విస్తరణ చేపట్టాలని కంపెనీని ప్రమోట్ చేస్తున్న  మై హోమ్ గ్రూప్ భావిస్తోంది. ఇప్పటికే గుంటూరులో స్థలాన్ని సమకూర్చుకుంది. ఇక్కడ రూ.1,500 కోట్లతో 1.5 మిలియన్ టన్నుల ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. నల్గొండ జిల్లాలోని ప్లాంటులో మరో యూనిట్‌ను మిలియన్ టన్నుల సామర్థ్యంతో రూ. 1,000 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనుంది. ఉత్తర, మధ్య, పశ్చిమ భారత్‌లో ఇప్పటికే ఉన్న ఇతర కంపెనీల ప్లాంట్లను కొనుగోలు చేయడం లేదా సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. మై హోమ్ గ్రూప్ టర్నోవరు రూ.5,000 కోట్లు. ఇందులో సిమెంటు వ్యాపారం ద్వారా రూ.3,000 కోట్లు సమకూరుతోంది. ఈ విభాగం రెండు మూడేళ్లలో రూ.5,000 కోట్లకు చేరుతుందని సంస్థ అంచనా.
 
 బల్క్ డ్రగ్, ఫార్మాలోకి..: సిమెంట్, నిర్మాణం, విద్యుత్, రవాణా రంగాల్లో ఉన్న మై హోమ్ గ్రూప్ బల్క్ డ్రగ్, ఫార్మా విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. ఏ ఉత్పత్తులతో ఎంట్రీ ఇవ్వాలో అన్న అంశంపై ఒక బృందం ఇప్పటికే అధ్యయనం చేస్తోంది. ఆరు నెలల్లో స్పష్టత వస్తుందని సాంబశివరావు వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు