శిక్షణతో పాటే సూక్ష్మ రుణాలు

8 Oct, 2013 02:15 IST|Sakshi
శిక్షణతో పాటే సూక్ష్మ రుణాలు
  •  ఇంటర్వ్యూ: ‘సాక్షి’తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ ఆదిత్యపురి
  •  ఆంధ్రప్రదేశ్‌లో అలా ఇవ్వలేదు కనకే ఆత్మహత్యలు
  •   రుణ గ్రహీతలకు శిక్షణ ఏ బ్యాంకూ ఇవ్వటం లేదు
  •   ఆంధ్రప్రదేశ్‌లో మా సూక్ష్మ రుణాలు పెరగాల్సి ఉంది
  •   ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఇవ్వటం మాకిష్టం లేదు
  •   దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం
  •   అన్నీ చూసుకుంటే 26 శాతం వడ్డీ పెద్ద ఎక్కువేమీ కాదు
  •   వచ్చే ఐదేళ్లలో గ్రామీణ వాటా 50 శాతానికి తీసుకెళతాం
  •   కోటి మంది మహిళలకు సూక్ష్మ రుణాలివ్వాలన్నది లక్ష్యం
  •   ఈ ఏడాది రుణాల్లో వృద్ధి 15 శాతం ఉండొచ్చు
  •   డిపాజిట్లు కూడా 13 శాతం వరకూ పెరిగే అవకాశముంది
  •   ఆదిత్యపురి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీకి ఎండీ. బ్యాంకు సేవల్ని గ్రామాల దిశగా తీసుకెళుతున్న వ్యక్తి. సస్టెయినబుల్ లైవ్లీహుడ్ ఇనీషియేటివ్ (ఎస్‌ఎల్‌ఐ) కింద 20 లక్షల మంది గ్రామీణ మహిళలకు సూక్ష్మ రుణాలిచ్చి... ఈ సందర్భంగా జైపూర్లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ సాక్షి బిజినెస్ ఎడిటర్ ఎం.రమణమూర్తితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ రుణాల తీరుతెన్నులపై సాగిన ఈ ఇంటర్య్వూ...
     
     సస్టెయినబుల్ లైవ్లీహుడ్ ఇనీషియేటివ్... పూర్తిగా మైక్రోఫైనాన్స్ మోడల్‌లోనే ఉందిగా?
     మేమిస్తున్నది సూక్ష్మ రుణాలే. కానీ దీన్లో కొత్తదనమేంటంటే శిక్షణ. వేరెవ్వరూ రుణాలిస్తూ... రుణగ్రహీతలకు శిక్షణ ఇవ్వటం లేదు. మేం దీన్ని బిజినెస్‌తోపాటు బాధ్యతగా కూడా భావిస్తున్నాం. రుణం కావాల్సిన గ్రామాలను గుర్తించటం, అక్కడి మహిళలతో మాట్లాడి స్వయం సహాయక గ్రూపుల్ని ఏర్పాటు చేయటం... వారికి రుణాలిచ్చేటపుడు కౌన్సెలింగ్ చేయటం, అవసరమైన అంశాల్లో వారికి శిక్షణనివ్వటం... ఇదంతా మా సిబ్బందే చేస్తారు.
     
     అంటే దీన్లో స్థానిక నాయకులు, ప్రభుత్వ గ్రూపుల ప్రమేయం ఉండదా?
     ఉండదు. ఎందుకంటే 3,500 మంది సిబ్బంది దీనికోసమే ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి ఈ సంఖ్యను మరో 50 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
     
     ఈ సూక్ష్మ రుణాలకు వసూలు చేసే వడ్డీ ఎంత?
     దాదాపు 26 శాతం. కాకుంటే దీన్లో శిక్షణ వంటివి కూడా ఉంటాయి. వాటికి ఎలాంటి చార్జీలూ వసూలు చేయటం లేదు. మేమే స్థానికంగా ఉన్న శిక్షకులకు పారితోషికం చెల్లించి గ్రామాల్లో పదేసి రోజుల శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిక్షణకు మా దగ్గర సూక్ష్మరుణాలు తీసుకున్న మహిళలతో పాటు స్థానికంగా ఆసక్తి ఉన్నవారు కూడా హాజరవుతున్నారు. వారి నుంచి కూడా ఎలాంటి చార్జీలూ వసూలు చేయటం లేదు. శిక్షణకయ్యే ఖర్చు వగైరా కూడా కలిసి ఉంటాయి కనక మొత్తం 26 శాతాన్నీ వడ్డీగా భావించలేం.
     
     కానీ ఆంధ్రప్రదేశ్‌లో వడ్డీపై పరిమితి విధిస్తూ ఆర్డినెన్స్ ఉంది కదా?
     మా రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ ఈ ఆర్డినెన్స్ నిర్దేశించిన పరిమితిలోపే ఉంది. అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తున్నామని నేననుకోవటం లేదు.
     
     ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికి 4 క్లస్టర్లలోనే సేవలందిస్తున్నట్లు చెప్పారు? విస్తరణ ఆగిందేం?
     అలాంటిదేమీ లేదు. అక్కడి చాలా జిల్లాల్లో రుణాల ఆవశ్యకత ఉంది. అక్కడ స్వయం సహాయక బృందాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ సూక్ష్మ రుణాలనైనా అక్కడి ‘సెర్ప్’ వంటి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారానే ఇవ్వాలంటోంది. మేం స్వతంత్రంగానే ఇస్తామంటున్నాం. ఈ విషయంపై ఇరువురి మధ్యా చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం అలా...
     
     కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో ఇక్కడ చెప్పాలి. అక్కడ మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఉత్పాదకతను దృష్టిలో పెట్టుకుని రుణాలివ్వలేదు. రుణమనేది ఏ వ్యాపారానికో, స్వయం ఉపాధికో ఇస్తే ఆ రుణం ద్వారా సంపాదించి వారు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. కానీ టీవీలు, ఫ్రిజ్‌ల వంటి వినియోగ వస్తువులకు కూడా వారు సూక్ష్మ రుణాలిచ్చేశారు. దీనివల్ల రుణాలు తీసుకున్న వారు తిరిగి చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. ఒక సంస్థ రుణం తీర్చడానికి వేరే సంస్థ దగ్గర సూక్ష్మ రుణం తీసుకునేవారు. ఇలా వారు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చివరికి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. కానీ మేం ఉపాధితో ముడిపడ్డ కార్యకలాపాలకే రుణాలిస్తున్నాం. దీన్లోనే పొదుపును కూడా ప్రోత్సహిస్తున్నాం. వారు సంపాదించిన దాంట్లో కొంత వాయిదాకు పోగా... కొంత పొదుపు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ఆ పొదుపుతో వారు వినియోగ వస్తువులు కొనుక్కున్నా పర్వాలేదు.
     
     ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎఫ్‌ఐలు మరీ అత్యాశకు పోయాయంటున్నారు కదా? ఏ సంస్థలవి?
     అందరికీ తెలిసిందే. నేను వాటి పేర్లు ప్రస్తావించటం బాగుండదు.
     
     ఎస్‌ఎల్‌ఐకి సంబంధించి మీ లక్ష్యాలేంటి?
     బ్యాంకింగ్ వ్యవస్థ ఎక్కువగా నగరాలు, పట్టణాలకే పరిమితమవుతోంది. దాన్ని గ్రామాలకు తీసుకెళ్లడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మా బ్యాంకింగ్‌ను చూసినా మా శాఖల్లో 56 శాతం సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ వాటి నుంచి వచ్చే ఆదాయం మాత్రం 15 శాతమే. అందుకే వచ్చే ఐదేళ్లలో ఈ సెగ్మెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని 50 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గడిచిన మూడేళ్లలో 7వేల గ్రామాల్లో 20 లక్షల మందికి 2,500 కోట్ల రుణాల్ని ఎస్‌ఎల్‌ఐ కింద మంజూరు చేశాం. 24 రాష్ట్రాల్లో ఈ  సేవలందిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరాంతానికి కోటి కుటుంబాలకు ఈ రుణాలివ్వాలన్నదే లక్ష్యం.
     
     దీన్నెందుకు మహిళలకే పరిమితం చేశారు?
     మహిళలకు ఆర్థిక శక్తి వస్తే వారు శక్తిమంతంగా మారతారు. మహిళ శక్తిమంతంగా మారితే కుటుంబం... తద్వారా సమాజం కూడా బలోపేతమవుతాయి. ఈ ఉద్దేశంతోనే ఎస్‌ఎల్‌ఐని మహిళలకే పరిమితం చేశాం.
     
     ఈ ఏడాది రుణాల్లో, డిపాజిట్లలో ఏ స్థాయి వృద్ధిని ఆశిస్తున్నారు? పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయి కదా?
     అలాంటిదేమీ లేదు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మంచి వర్షాలు పడ్డాయి. పంటలు బావుంటే వ్యవస్థలో నగదు ప్రవాహం పెరుగుతుంది. లిక్విడిటీ మెరుగుపడితే రుణాలు, డిపాజిట్లు రెండూ పెరుగుతాయి. రుణాల్లో 15-16 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. ఆస్తులకన్నా డిపాజిట్ల బేస్ ఎక్కువ కాబట్టి 15 శాతం రుణాల వృద్ధిని తట్టుకోవటానికి డిపాజిట్లు 13 శాతం పెరిగితే చాలు. అది సాధ్యమవుతుందనే మా అంచనా.
     

మరిన్ని వార్తలు