పత్తి రైతులకు సూక్ష్మసేద్యం సబ్సిడీ బంద్

27 Nov, 2015 00:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పత్తి సాగును నిరుత్సాహపరచాలని యోచిస్తోంది. పత్తి రైతులకు సబ్సిడీపై సూక్ష్మ సేద్యం పరికరాలు ఇవ్వకూడద ని భావిస్తోంది. దీనికి సంబంధించి త్వరలో ఒక నిర్ణయం తీసుకునే దిశగా ఉద్యానశాఖ కసరత్తు చేస్తోంది. పత్తి పంట వేసి వర్షాలు రాక ఎండిపోయి, పెట్టుబడులు పెరిగి అప్పుల్లో కూరుకుపోయి అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సర్కారు వేసిన అంచనా ప్రకారం ఆత్మహత్య చేసుకున్నవారిలో ఎక్కువ మంది పత్తి రైతులేనని వెల్లడైంది.

అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పంటల కంటే ఎక్కువ సాగు అయ్యేది పత్తే. రాష్ట్రంలో ఖరీఫ్‌లో సాధారణ పంటల సాగు 1.03 కోట్ల ఎకరాలు కాగా, అందులో పత్తి సాగే 40.80 లక్షల ఎకరాలు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణం కంటే ఎక్కువగా పత్తి సాగైంది. ఇతర పంటల సాగు తగ్గింది. ఈ పరిస్థితుల్లో పత్తికి సూక్ష్మసేద్యం కోసం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించడం సమంజసం కాదని యోచిస్తోంది.

సబ్సిడీ ఇచ్చి రైతును నష్టాలపాలు చేసి ఆత్మహత్యలకు పురిగొల్పే పరిస్థితులకు కారణం కాకూడదని ఉద్యానశాఖ యోచిస్తోంది. అందుకే వచ్చే ఏడాది నుంచి పత్తికి సూక్ష్మసేద్యం సబ్సిడీని నిరాకరించాలని యోచిస్తోంది.
 
ఐదు హెక్టార్ల వరకు సూక్ష్మసేద్య సబ్సిడీ
తెలంగాణలో ఒక్కో రైతుకు ఐదు హెక్టార్ల వరకు సూక్ష్మసేద్యం కింద సబ్సిడీ ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీపై సూక్ష్మసేద్య పరికరాలు అందజేస్తారు. చిన్న, సన్నకారు రైతులకు 90% సబ్సిడీ అందజేస్తారు. ఇతర రైతులకు 80% సబ్సిడీపై అందజేస్తారు. ఈ పథకం కోసం కేటాయిస్తున్న నిధుల్లో 16.05% ఎస్సీ రైతులకు, 9.55% ఎస్టీ రైతులకు, 64.40% సన్న, చిన్నకారు రైతులకు కేటాయిస్తారు. తమకు ఇష్టమైన సూక్ష్మ సేద్య కంపెనీ పరికరాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు.  

సూక్ష్మసేద్యంతో ఉత్పాదకత పెరిగే అవకాశం ఉండటంతో అందరూ వీటి కోసం పరుగులు పెడుతున్నారు. అందులో పత్తి రైతులు భారీ సంఖ్యలో ఉన్నారని తెలిసింది. ఆహారధాన్యాలు, తృణధాన్యాల సాగుకు సిద్ధమయ్చే వారికే అధికంగా సూక్ష్మసేద్యం సబ్సిడీని వర్తింప చేయాలన్న ఆలోచన కూడా ఉంది. ఆ విధంగా ఆహారధాన్యాల సాగును పెంచాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు